ట్రావెన్‌కోర్  దేవసోం బోర్డు అధ్యక్షులు ప్రయర్ గోపాలక్రిష్ణన్ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. గౌరవప్రదమైన కుటుంబాల్లో పుట్టే మహిళలు శబరిమలైలోకి అడుగుపెట్టకూడదని ఆయన తెలియజేశారు. ఇటీవలే మహిళలందరికీ దేవాలయ ప్రవేశం కల్పించాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. "ఇందులో వ్యక్తిగతంగా మాట్లాడేది ఏమీలేదు. అయితే దేవాలయాల్లో ఉండే పలు రక్షణ నియమాలు, పద్ధతులు కూడా ముఖ్యమైనవే. ఒకవేళ కోర్టు 15 - 50 ఏళ్ళ వయసున్న మహిళలు శబరిమలై సందర్శించవచ్చు అని తెలిపినా, గౌరవప్రదమైన కుటుంబాల్లో పుట్టిన మహిళలు మాత్రం ఈ ఆలయాన్ని సందర్శించరని మేము భావిస్తున్నాం" అని ఆయన తెలిపారు. ఈ క్రమంలో పలువురు తనపై చేసిన విమర్శలకు జవాబిస్తూ ఆయన, శబరిమలైను థాయిలాండ్‌గా భావించవద్దు అని హితవు పలికారు. 


కొట్టాయం ప్రాంతంలో మీడియాతో మాట్లాడుతూ, ఒకవేళ మహిళలు శబరిమలైను సందర్శిస్తే.. అది పుణ్యక్షేత్రం కన్నా ముందు పర్యటక ప్రదేశంగా మారుతుందని ప్రయర్ గోపాలక్రిష్ణన్  చెప్పారు. అనుకూలించని వాతావరణంలో ఎలాంటి రక్షణ నియమాలు పాటించకుండా మహిళలు శబరికొండ ఎక్కుతూ ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి? వారి భద్రతకు బాధ్యులెవరు? మనం శబరిమలైను థాయిలాండ్‌గా మార్చాలా వారికోసం..?" అని ఆయన అన్నారు. జస్టిస్ దీపక్ మిశ్రా, భానుమతి, అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం వెలువరించిన తీర్పుపై తనకు భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు తెలిపారు.