కేంద్రం తీరుపై సుప్రీం కోర్టు జడ్జి కురియన్ జోసెఫ్ అసంతృప్తి
ఇటీవల సుప్రీం కోర్టు కొలిజియం చేసిన సిఫార్సును కేంద్రం తోసిపుచ్చడంపై సుప్రీం కోర్టు న్యాయమూర్తి, కొలిజియం సభ్యుడు జస్టిస్ కురియన్ జోసెఫ్ అసంతృప్తి
ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్‌ను సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఇటీవల సుప్రీం కోర్టు కొలిజియం చేసిన సిఫార్సును కేంద్రం తోసిపుచ్చడంపై సుప్రీం కోర్టు న్యాయమూర్తి, కొలిజియం సభ్యుడు జస్టిస్ కురియన్ జోసెఫ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఇందూ మల్హోత్రా పేరును ఆమోదించిన కేంద్రం జోసెఫ్ ఫైల్‌ను పునఃపరిశీలించాలని కొలిజియంకు తిప్పిపంపిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై జస్టిస్ కురియన్ జోసెఫ్ స్పందిస్తూ.. అత్యున్నత న్యాయస్థానం కొలిజియం చేసిన సిఫార్సును కేంద్రం తిరస్కరించడం సరికాదు అని అభిప్రాయపడ్డారు. సుప్రీం కోర్టు కొలిజియం సిఫార్సులని కేంద్రం తిప్పి పంపడం వల్లే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ఈ అంశంపై తీవ్ర చర్చ జరుగుతోందని, లేదంటే అసలు చర్చకు తావే వుండేది కాదని అన్నారు. కేఎం జోసెఫ్‌ను సుప్రీం న్యాయమూర్తిగా నియమించాలని కేంద్రానికి సిఫార్సు చేసిన కొలిజియంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ జే చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గగోయ్, మదన్ బీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు సభ్యులుగా ఉన్నారు.
ఇదిలావుంటే, జోసెఫ్ నియామకం వాయిదా పడిన నేపథ్యంలో కోల్‌కతా, రాజస్థాన్, తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల పేర్లను కూడా సుప్రీం న్యాయమూర్తుల నియామకానికి కొలిజియం పరిశీలిస్తుండటం గమనార్హం.