ఢిల్లీలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి స్కూల్ టాయిలెట్ లో ఆకస్మికంగా మరణించాడు. స్కూల్ యాజమాన్యం ఆ పిల్లవాడు అస్వస్థతతో చనిపోయినట్లు చెబుతుండగా.. ఇది హత్యేనని పిల్లవాడి తల్లితండ్రులు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే.. ఎప్పటిలాగే గురువారం కూడా 14 సంవత్సరాల విద్యార్థి తుషార్ స్కూల్ కు వెళ్లాడు. స్కూల్ లో ఉన్న సమయంలో అస్వస్థతకు గురికావడంతో స్కూల్ యాజమాన్యం జిటీబీ హాస్పిటల్ లో చేర్పించి.. తల్లితండ్రులకు సమాచారం అందించింది. హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్న వారికి చనిపోయాడని వైద్యులు చెప్పారు. విద్యార్థి తల్లితండ్రులు.. తన కుమారుడిని కొంతమంది విద్యార్థులు కలిసి చావబాదారని ఆరోపించారు. ఇది ముమ్మాటికీ హత్యే అని అన్నారు.


విద్యార్థి మృతి వెనుక ముగ్గురు విద్యార్థుల హస్తం ఉందననే అనుమానంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. బాత్రూం లోపల మరణించిన విద్యార్థితో సహా ఐదుగురు ఉన్నట్లు.. వారు గొడవపడుతున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ లో ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు. డిప్యూటి కమీషనర్ అజిత్ సింగ్లా మాట్లాడుతూ- " సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కేసును రిజిస్టర్ చేశాం. కెమరాలో చనిపోయిన విద్యార్థి నలుగురితో గొడవ పడుతున్నట్లు కనిపించాడు. పిడిగుద్దులు కొట్టడంతో అతను కిందపడి మరణించాడు. నిందితుల్లో ముగ్గురిని పట్టుకున్నాం. నాల్గో వ్యక్తిని గాలిస్తున్నాం" అన్నారు.



కాగా యాజమాన్యం నిందితులను కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తుందని తుషార్ బంధువులు, కుటుంబ సభ్యులు స్కూల్ ఎదుట బైఠాయించారు. కర్వాల్ నగర్ ఎల్ఎల్ఏ కపిల్ మిశ్రా జోక్యం చేసుకొని సర్దిచెప్పడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తుషార్ మృతదేహంపై  ఎటువంటి గాయాలు  లేవని.. పోస్టుమార్టం అనంతరం నిజమేంటో తెలుస్తుందని పోలీసులు చెప్పారు.