కాంగ్రెస్ నాయకులందరూ తాము ఎదుర్కొంటున్న కేసుల్లో బెయిల్ కోసం ప్రయత్నించడమే పనిగా పెట్టుకున్నారని భారత ప్రధాని ఆ పార్టీపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీని ఓ బెయిల్ వాహనంగా ఆయన పేర్కొన్నారు. ఇటీవలే జైపూర్ ప్రాంతంలో జరిగిన బహిరంగ సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 2100 కోట్ల రూపాయల వ్యయంతో అర్బన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను ప్రారంభించడానికి శంకుస్థాపన చేసిన మోదీ.. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేపై కూడా ప్రశంసలు కురిపించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆమె రాష్ట్రపు రూపరేఖలనే మార్చేసిందని కితాబిచ్చారు. రాజస్థాన్ అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం కూడా సాధ్యమైనన్ని నిధులు ఇవ్వడానికి ప్రయత్నిస్తుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా దళితులు, రైతులు, మహిళలు, వెనుకబడిన తరగతులవారి ఉన్నతికే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. అందుకుకోసమే బీజేపీ ప్రభుత్వం అనేక పథకాలకు శ్రీకారం చుట్టిందని మోదీ అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాకే పనులన్నీ పెండింగ్ లేకుండా సక్రమంగా జరుగుతున్నాయని మోదీ తెలిపారు. 


"వికాసం.. వికాసం.. వికాసం" అన్నదే బీజేపీ స్లోగన్ అని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. అమ్రుదోన్ కా బాగ్ స్టేడియంలో జరిగిన ఈ బహిరంగ సమావేశానికి కార్యకర్తలను తరలించడానికి దాదాపు 5000 బస్సులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది. ముఖ్యంగా ఆళ్వార్, ఉదయ్ పూర్, అజ్మీర్ ప్రాంతాల నుండి అనేకమంది బీజేపీ కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు.


తొలుత జైపూర్ ప్రాంతంలోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో కట్టిన రెండు హెలీప్యాడ్లలో ఒకదానిపై మోదీ వచ్చిన విమానం ల్యాండ్ అయ్యింది. అక్కడ నుండి ఆయన సమావేశ స్థలికి కారులో చేరుకున్నారు. ముఖ్యమంత్రి వసుంధర రాజే స్వయంగా వెళ్లి మోదీని ఆహ్వానించారు. దాదాపు ఈ సమావేశానికి 2 లక్షలమంది హాజరైనట్లు రిపోర్టులు చెబుతున్నాయి.