కేంద్ర మంత్రిపై లైంగిక వేధింపుల ఆరోపణలు; రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్
`మీటూ`ఉద్యమం: కేంద్ర మంత్రిపై లైంగిక వేధింపుల ఆరోపణలు
కేంద్ర మంత్రి ఎంజె అక్బర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఎంజె అక్బర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. 'కేంద్ర మంత్రి ఎం.జె.అక్బర్ ఈ ఆరోపణలకు సంతృప్తికరమైన జవాబు ఇవ్వాలి లేదా రాజీనామా చేయాలి. ఈ విషయంలో విచారణ చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాము' అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి అన్నారు.
ఆరోపణలపై కేంద్ర మంత్రి సైలెంట్‌గా ఉండటంపై కాంగ్రెస్ స్పందిస్తూ.. "ఇది ఎంతో సీరియస్ విషయం. దీనిపై మంత్రి మాట్లాడటం అవసరం. నిశ్శబ్దంగా ఉండటం మంచిది కాదు. ఈ విషయంపై దర్యాప్తు చేపట్టాలి. ప్రధాని, మంత్రి దీనిపై మాట్లాడాలి' అని కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారీ మంగళవారం చెప్పారు.
అయితే ఈ అంశంపై అటు కేంద్ర ప్రభుత్వం గానీ, ఇటు బీజేపీ పార్టీ గానీ ఇప్పటివరకు ఏమీ మాట్లాడలేదు.
కేంద్రమంత్రి, మాజీ సంపాదకుడు ఎంజే అక్బర్ పై ప్రియారమణి అనే పాత్రికేయురాలు మీటూ ఉద్యమం ద్వారా లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.
కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ విషయంపై స్పందించడానికి నిరాకరించారు. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు. 'అవి తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు. మీరు మహిళా మరియు కేంద్ర మంత్రి. ఈ ఆరోపణల మీద విచారణ జరిపిస్తారా?' అని ప్రశ్నించగా.. మంత్రి సుష్మా స్పందించలేదు. ప్రముఖ పాత్రికేయుడైన ఎంజే అక్బర్.. ప్రస్తుతం విదేశాంగ సహాయ మంత్రిగా ఉన్నారు.
తనతో 17 ఏళ్ల కిందట అక్బర్ ఇలాగే ప్రవర్తించారని, అయితే తన దగ్గర ఆధారాలేమీ లేకపోవడంతో బయటకు రాలేదని ప్రేరణ సింగ్ బింద్రా అనే మరో మహిళ కూడా ట్వీట్ చేశారు. ఇలా ఇప్పటి వరకు ఎంజె అక్బర్‌పై ఆరుగురు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.
మరోవైపు, కేరళ ఎమ్మెల్యే(సీపీఎం), మాజీ నటుడు ముకేశ్ 1999లో ఓ షూటింగ్‌లో తనని వేధించారని బాలీవుడ్ కాస్టింగ్ డైరెక్టర్ ఆరోపించారు.
కేంద్ర మంత్రి ఎంజె అక్బర్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ బదులిస్తూ.. మహిళపై ఎవరైనా, ఏ స్థాయిలో ఉన్న వారైనా సరే (మంత్రులతో సహా) లైంగిక వేధింపులకు పాల్పడితే తీవ్రంగా పరిగణిస్తామన్నారు.
బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా చేసిన నానా పాటేకర్‌పై చేసిన ఆరోపణలతో ‘మీటూ’ తరహా ఉద్యమం తీవ్రమైంది.
బాలీవుడ్‌లోనూ ‘మీటూ’ ఉద్యమం తీవ్రమైంది. సినీ ప్రముఖులపై అనేక ఆరోపణలు వస్తున్నాయి.