మహారాష్ట్ర: కర్ణాటక గవర్నర్ వాజూభాయ్ వాలాను ఉద్దేశించి ఓ కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. గవర్నర్‌ను శునకంతో పోలుస్తూ ఆ నేత చేసిన వ్యాఖ్యలు బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి తెరలేపాయి. కర్ణాటక అసెంబ్లీలో మెజారిటీ లేనప్పటికీ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ వాజుభాయ్ వాలా ఆహ్వానించడం, బల నిరూపణకు ముందే యడ్యూరప్ప రాజీనామా చేయడం నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు సంజయ్ నిరుపమ్..ఇక నుంచి భారతీయులు తమ పెంపుడు శునకాలకు గవర్నర్ పేరు పెట్టుకుంటారని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో 104 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ అధికార పీఠానికి 9 స్థానాల దూరంలో ఉండిపోయింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ, కాంగ్రెస్- జేడీఎస్‌లు తమకే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరగా.. బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడం, యడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం, బలనిరూపణకు 15రోజుల గడువు ఇవ్వడం తెలిసిందే.


దీంతో సీన్ హస్తినకు చేరుకుంది. గవర్నర్ చర్యను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్-జేడీఎస్‌లు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అత్యున్నత న్యాయస్థానం శనివారం సాయంత్రమే బలనిరూపణ ఎదుర్కోవాలని ఆదేశించడంతో.. దానికంటే ముందే యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ తీరును నిరసిస్తూ వ్యాఖ్యలు చేసిన సంజయ్‌,  'విశ్వాసానికి మారుపేరుగా నిలిచిన వాజూభాయ్‌ ఇందులో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇక నుంచి భారతీయులు తాము పెంచుకునే శునకాలకు వాజూభాయ్‌ అని పేరుపెట్టుకుంటారు’ అని వ్యాఖ్యానించారు.