`ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ను ప్రకటించం`: పి చిదంబరం
`ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ను ప్రకటించం`: పి చిదంబరం
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని 2019లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రచారం చేయబోమని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం అన్నారు. ప్రధాని అభ్యర్థిని ఎన్నికలకు ముందు పేరు ప్రకటించకుండా గతంలో చాలా మంది ప్రధానులు అయ్యారన్నారు. ఈసారి అదే సూత్రాన్ని వచ్చే ఎన్నికలకు వర్తింపజేస్తామన్నారు. రాహుల్ గాంధీతో సహా వేరే ఎవరినీ కూడా ప్రధాన మంత్రి పదవికి అభ్యర్థిగా ప్రకటించబోమని చిదంబరం చెప్పారు.
ఓ జాతీయ మీడియాకి చెందిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో బీజేపీని చెక్ పెట్టేందుకు ప్రాంతీయ పార్టీలతో కూటమిని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, అలాంటి సంకీర్ణ కూటమికి నాయకత్వం వహించవచ్చని.. అయితే వారి నుంచి వచ్చే స్పందన మిశ్రమంగా ఉందన్నారు.
'రాహుల్ ప్రధాని అని మేము ఎప్పుడూ చెప్పలేదు. కొందరు కాంగ్రెస్ నాయకులు ఈ అంశంపై మాట్లాడుతున్నప్పుడు, ఏఐసీసీ జోక్యం చేసుకొని అలాంటి చర్చను నిలిపివేసింది. బీజేపీని గద్దె దించాలని మేము కోరుకుంటున్నాం.' అన్నారు. బీజేపీ స్థానంలో వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించే, స్త్రీల, పిల్లల రక్షణకు కల్పించే, రైతుల ఆదాయాన్ని పెంచే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నామన్నారు.
మా మొదటి లక్ష్యం బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి రాకూడదు.. ఇందుకోసం కూటమి ఏర్పడాలన్నారు. ఇక రెండవది ఎన్నికల అనంతరం ప్రధాని అభ్యర్థి. కూటమి భాగస్వామ్య పక్షాలు కలిసి కూర్చొని చర్చిస్తారు. ప్రధాని ఎవరనేది తేలుస్తారన్నారు.
జాతీయ పార్టీల ఓట్లను ప్రాంతీయ పార్టీలు లాగేసుకుంటున్నాయని, కాంగ్రెస్, బీజేపీ పార్టీల ఓట్ షేరింగ్ 50 శాతం కన్నా తక్కువకు పడిపోయిందన్నారు. కాంగ్రెస్‌తో చేతులు కలిపే ప్రాంతీయ పార్టీలను మోదీ ప్రభుత్వం భయపెడుతోంది ఆరోపించారు.
ఇటీవలే ప్రధాని అభ్యర్థిత్వంపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. 'వారు (కూటమి భాగస్వామ్య పక్షాలు) నన్ను ప్రధాని కావాలనుకుంటే ఖచ్చితంగా.. నేను సిద్దమే."అన్నారు.