Cyclone Biparjoy Latest News: బిపోర్‌ జాయ్‌ తుఫాన్ తీవ్రరూపం దాల్చింది. అరేబియా సముద్రంలో చురుగ్గా కదులుతూ దూసుకువస్తోంది. ఈ నెల 15వ మధ్యాహ్నం గుజరాత్‌లోని కచ్‌ జిల్లా జఖౌవద్ద తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఆ సమయంలో బిపోర్‌ జాయ్‌ తీవ్ర తుఫాన్‌గా ఉంటుందని.. గంటలకు 150 కి.మీ వేగంలో గాలులు వీస్తాయని భారత వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బిపోర్‌ జాయ్‌ తుఫాన్ ప్రభావంపై ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుజరాత్‌లోని కచ్, దేవభూమి ద్వారక, పోర్‌బందర్, జామ్‌నగర్, మోర్బీ, జునాఘర్, రాజ్‌కోట్‌లతోపాటు పలు జిల్లాలపై బిపోర్‌ జాయ్‌ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో అధికారులను భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అప్రమత్తం చేసింది. సౌరాష్ట్ర, కచ్ తీరాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర మాట్లాడుతూ.. బుధవారం ఆరెంజ్ అలర్ట్, జూన్ 15న రెడ్ అలర్ట్ జారీ చేశామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే సముంద్ర తీరప్రాంతానికి దగ్గరగా వారిని అధికారులు ఖాళీ చేస్తున్నారు. వారందరనీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చేపల వేటను ఇప్పటికే నిషేధించారు. విపత్తును ఎదుర్కొనేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రెడీ అయ్యాయి. 


బిపోర్‌ జాయ్‌ తుఫాన్ బలపడటంతో ముంబైలోని మెరైన్ డ్రైవ్‌లో అలలు భారీగా ఎగిసిపడ్డాయి. గేట్‌వే ఆఫ్ ఇండియా ప్రాంతంలో కూడా అలలు ఎగిసిపడ్డాయి. గుజరాత్‌లోని కచ్‌, దేవభూమి ద్వారక, పోర్‌బందర్‌, జామ్‌నగర్‌, మోర్బీ జిల్లాల్లో తుపాను ఉధృతంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ల్యాండ్‌ఫాల్ సమయంలో లోతట్టు ప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉందని అంచనా వేసింది. గుజరాత్‌లో రానున్న ఐదు రోజుల్లో ఉరుములు మెరుపులతో కూడిన గాలి వేగం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు గుజరాత్ ప్రభుత్వం అన్ని ముందుజాగ్రత్త చర్యలను చేపట్టింది. తీరం దాటిన తర్వాత సేవలను పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. విద్యాసంస్థలకు ఈ నెల 15వ తేదీ వరకు సెలవులు ప్రకటించగా.. కచ్‌ జిల్లాలో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. 


మరోవైపు రైల్వే శాఖ కూడా అప్రమత్తమైంది. తుఫాను దృష్ట్యా పశ్చిమ రైల్వే విపత్తు నిర్వహణ గది, హెల్ప్ డెస్క్, రిలీఫ్ రైళ్లను సిద్ధం ఉంచింది. కోస్టల్ గుజరాత్‌లో గాంధీధామ్, వెరావల్, ఓఖా, పోర్ బందర్‌లకు వెళ్లే 56 రైళ్లను అహ్మదాబాద్, రాజ్‌కోట్, సురేంద్రనగర్‌ వరకే నడుపుతున్నారు.  నేటి నుంచి గురువారం వరకు దాదాపు 95 రైళ్లను రద్దు చేయాలని ప్రతిపాదించారు. ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.


Also Read: World Cup 2023 Schedule: ప్రపంచకప్‌లో టీమిండియా షెడ్యూల్ ఇదే.. పాక్‌తో మ్యాచ్‌ ఎప్పుడంటే..?  


Also Read: AP Inter Results 2023: రేపే ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి