'ఓఖీ' తుఫాను క్రమేపీ బలహీన పడుతోందని.. అయినా అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ విభాగం ఐఎండీ తెలిపింది. తుఫాను బలహీన పడుతున్నప్పుడు తీర ప్రాంతాలలో ఈదురుగాలులు బలంగా వీచే అవకాశం ఉందని పేర్కొనింది. దీంతో భారత రక్షణ దళాలు, కోస్టల్ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ఓఖీ' తుఫాను దెబ్బకు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్ ప్రాంతాలు తీవ్ర ప్రభావితమయ్యాయి. భారీ వర్షాలకు ఈదురుగాలులు కూడా తోడవ్వడంతో భారీగానే ఆస్తి నష్టం సంభవించింది. తీర ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లిన ప్రజలను భారత రక్షణ దళాలు రక్షించినా.. ఇంకా కొంత మంది జాడ తెలియరాలేదు. నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇతర బృందాలు సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. తుఫాను కారణంగా కొన్ని ప్రాంతాల్లో రోడ్డు కొట్టుకుపోయాయి. చెట్లు, కరెంట్ స్థంబాలు నేలకొరిగాయి. ఇళ్ళు నేలమట్టమయ్యాయి. సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. బాధితులను సమీప పునరావాస కేంద్రాలకు తరలించారు.


కన్యాకుమారి విలవిల


తమిళనాడు లోని కన్యాకుమారి తుఫాను దెబ్బకు అతలాకుతలం అయ్యింది. ప్రధాన రహదారులు, వీధులన్నీ చెరువులను తలపించాయి. కరెంట్ లేక గత నాలుగు రోజుల నుంచి పట్టణ వాసులు అంధకారంలోనే ఉన్నారు. తాగునీరు లేక ఇక్కట్లకు గురైతున్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన వెయ్యి మంది ఆచూకీ ఇంకా తెలియలేదు. రవాణా, సమాచార వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి.


531 మందిని రక్షించాం: కేరళ సీఎం పినరాయి


గల్లంతైన జాలర్లలో ఇప్పటివరకు రెస్క్యూ టీమ్ కేరళకు చెందిన 531 మందిని కాపాడింది. మిగితావారిని రక్షించే పనిలో వారు నిమగ్నమయ్యారు.  తుఫానుల కారణంగా నలుగురు మృత్యువాత పడ్డారు. చనిపోయిన కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడ్డవారికి రూ.20 వేలు ఇస్తామని.. తుఫాను ధాటికి మర పడవలు, ఇతరత్ర కొట్టుకుపోయిన కుటుంబాలను కూడా ఆదుకుంటామని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఒక ప్రకటనలో తెలిపారు.