ఈ రోజు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ ప్రాంతంలో ఆర్‌ఎస్‌ఎస్ నేత సునీల్ బన్సాల్ అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాలలతో అలంకరించారు. అయితే బన్సాల్ వెళ్లిపోగానే పలువురు దళిత న్యాయవాదులు వచ్చి విగ్రహాన్ని పాలతో, గంగాజలంతో శుభ్రపరిచారు. బన్సాల్ వచ్చి పూలదండ వేయడం వల్ల అంబేద్కర్ విగ్రహం అపవిత్రమైందని వారు ఆరోపించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు వచ్చి అంబేద్కర్ విగ్రహాన్ని తాకడం వల్ల అది అపవిత్రమైందని మేము అనుకుంటున్నాం. బీజేపీ ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వంగా మారుతోంది. వారికి అంబేద్కర్ పేరు కూడా పలికే హక్కు లేదు. అయినా స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వారు అంబేద్కర్ పేరును వాడుకుంటున్నారు" అని వారు అన్నారు.


ఇటీవలి కాలంలో అచ్చం ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్‌లోని హమిర్ పూర్ ప్రాంతంలో జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే మనిషా అనురాగి హమిర్ పూర్ ప్రాంతంలో ఓ ఆలయాన్ని సందర్శించారు. అయితే ఆ ఆలయంలోకి మహిళలు రాకూడదని పూజారులు ఆక్షేపించారు. 


బీజేపీ ఎమ్మెల్యే మనీషా అనురాగి ఆలయాన్ని సందర్శించి తిరిగి వెళ్లిపోగానే.. దేవతా విగ్రహాలను శుభ్రపరచడానికి వాటిని అలహాబాద్ పంపించారు. "నేను ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఆలయంలో లేను. ఈ ఆలయ నిబంధనల ప్రకారం ఇక్కడకు మహిళలు రావడం నిషిద్ధం. నేను ఆ సమయంలో ఉండుంటే ఆమెకు సరైన వివరణ ఇచ్చి ఉండేవాడిని. ఆమెను కచ్చితంగా ఆలయంలోకి రానిచ్చేవాడిని కాదు" అని హమిర్ పూర్ ఆలయ పూజారి తెలిపారు.


అయితే పూజారి మాటలను మనీషా అనురాగి ఖండించారు. పూజారి మాటలు మహిళలను అవమానపరిచే విధంగా ఉన్నాయని ఆమె తెలిపారు. బుద్ది హీనతతో మాట్లాడేవారు అలాగే మాట్లాడతారని ఆమె అన్నారు.