సుంజ్వాన్ దాడి: కీలక ప్రకటన చేసిన భారత్
శనివారం కాశ్మీరులోని సుంజ్వాన్ ఆర్మీ క్యాంపుపై కొందరు ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే.
శనివారం కాశ్మీరులోని సుంజ్వాన్ ఆర్మీ క్యాంపుపై కొందరు ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్ వెళ్లిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో ఆమె ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మలా సీతారామన్ మాట్లాడారు.
పాకిస్తాన్‌కు చెందిన జైషే ఈ మొహమ్మద్(జేఈఎమ్) అనే ఉగ్ర సంస్థకు ఈ దాడితో సంబంధం ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. తాము అందుకు తగిన ఆధారాలు అన్నీ సేకరిస్తున్నామని.. పాకిస్తాన్‌కు కూడా ఆ వివరాలు అందజేస్తామని ఆమె తెలిపారు. పాకిస్తాన్ వైఖరి తమకు ఏ మాత్రం నచ్చడం లేదని కూడా ఆమె అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఎంత బాధ్యత గల ప్రభుత్వమో మరోమారు నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని సీతారామన్ అన్నారు.
ఉగ్రవాదులు దుశ్చర్య వల్ల భారత్ తీవ్రంగా నష్టపోతోందని సీతారామన్ అన్నారు. పాకిస్తాన్ తన వైఖరి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని ఆమె తెలిపారు. మీడియా సమావేశం తర్వాత ఆమె దాడిలో గాయపడిన భారత సైనికులను ఆసుపత్రిలో కలిశారు.