దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుకుంది. నగరంలో 'హెల్త్‌ ఎమర్జెన్సీ' ప్రకటించారు. పిల్లలు బయట ఆడుకోవడానికి వెళ్లకూడదని  వైద్యులు సూచించారు. అంతేకాక ఈ నెలలో జరగనున్న  'హాఫ్‌ మారథాన్‌' ను నిలిపివేయాలని ఢిల్లీ ప్రభుత్వానికి ఇండియన్‌ మెడికల్ అసోసియేషన్‌ (ఐఎంఏ) కోరింది. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో పర్టిక్యులేట్‌ మేటర్‌ (పీఎం) పెరిగిపోయిందని, అందుకే  నవంబర్19న నిర్వహించ తలపెట్టిన పరుగును రద్దు చేయాలని కోరింది.


ఢిల్లీ ప్రభుత్వం కూడా వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్, జాగింగ్‌ లను నగర ప్రజలు  కొన్నిరోజులు  మరిచిపోవాలని సూచించింది. ఇందులో భాగంగా స్కూళ్లకు కొద్దిరోజులు సెలవులు ప్రకటించాలని సీఎం కేజ్రీవాల్‌ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాను కోరారు. 
 
ప్రజల ఆరోగ్యాలకు పెనుముప్పు కలిగించే పీఎం 2.5 స్థాయి ఢిల్లీలో 703కు చేరుకుందని అమెరికన్‌ ఎంబసీ పేర్కొనడంతో ఐఎంఏ ఢిల్లీ ప్రభుత్వానికి పలు సూచనలు, సలహాలు చేసింది. నగరంలో కాలుష్యం  ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఢిల్లీలో పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించామని ఇండియన్‌ మెడికల్ అసోసియేషన్‌ (ఐఎంఏ) చీఫ్‌ కృష్ణకుమార్‌ అగర్వాల్‌ తెలిపారు.