ప్రధాని నరేంద్ర మోదీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరోక్షంగా తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రధాని కుర్చిలో మన్మోహన్ సింగ్ లాంటి చదువుకున్న ప్రధాని లేరే అని జనం ఆవేదన చెందుతున్నారని కేజ్రీవాల్ గురువారం ఓ ట్వీట్ చేశారు. అంతటితో ఆగకుండా ప్రధాని హోదాలో వుండేవాళ్లు బాగా చదువుకున్న వాళ్లు అయ్యుండాలి అని కేజ్రీవాల్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. కేజ్రీవాల్ చేసిన ట్వీట్‌లో దాగున్న గూడార్థం ఏంటో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు అంటున్నారు ఆ ట్వీట్‌పై స్పందించిన నెటిజెన్స్. పరోక్షంగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతలను ఉద్దేశించే కేజ్రీవాల్ ఈ ట్వీట్ చేశారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ అంటేనే గిట్టని కేజ్రీవాల్ ఇప్పుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ని ప్రశంసించడం అంటే, కచ్చితంగా అది ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీని కించపర్చడానికే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



చదువుకున్న వాళ్లు దేశ ప్రధాని అయితే బాగుంటుంది అని ట్వీట్ చేసిన అరవింద్ కేజ్రీవాల్ పనిలో పనిగా మరో వార్తా కథనాన్ని సైతం ట్విటర్‌లో షేర్ చేసుకున్నారు. రూపాయి విలువ బలహీనపడుతున్న కారణంగా భవిష్యత్‌లో పెట్టుబడులపై తీవ్ర ప్రభావం తప్పదని వివరిస్తూ ప్రచురించిన ఓ వార్తా కథనాన్ని కేజ్రీవాల్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.