న్యూఢిల్లీ: అసదుద్దీన్ ఒవైసీ మరోసారి న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ 2014లో ద్వేషపూరితమైన ప్రసంగం ఇస్తూ ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేస్తూ సామాజిక కార్యకర్త అజయ్ గౌతమ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఢిల్లీలోని కర్కడూమా కోర్టు.. ఓవైసీపై విచారణ చేపట్టి నివేదిక సమర్పించాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తోన్న అసదుద్దిన్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా అజయ్ తన ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు. అజయ్ గౌతం పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సందర్భంలోనే ఢిల్లీ పోలీసులకు ఈ ఆదేశాలు జారీ చేసిన కోర్టు.. పిటిషన్ తర్వాతి వాయిదాను మార్చి 26వ తేదీకి వాయిదా వేసింది.


గతంలోనే అజయ్ గౌతం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అసదుద్దిన్ ఒవైసీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఈ కేసులో సరైన ఆధారాలు లేవని కేసును మూసేశారు. దీంతో పోలీసులు అసదుద్దిన్ ఒవైసీపై కఠినంగా వ్యవహరించకుండానే, కనీసం వాంగ్మూలం కూడా తీసుకోకుండానే కేసు మూసేశారని సవాలు చేస్తూ అజయ్ గౌతం ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. దీంతో అసదుద్దీన్ ఒవైసీ ద్వేషపూరిత ప్రసంగంపై విచారణ జరిపించాల్సిందిగా కోర్టు ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.