ఢిల్లీ ఎన్నికలు: 5 సున్నిత పోలింగ్ కేంద్రాల్లో భద్రత కట్టుదిట్టం
నేడు ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. షాహీన్‌బాగ్ పరిధిలోని 5 పోలింగ్ కేంద్రాలను సున్నితమైన పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు.
దేశంలో కీలకమైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు శనివారం జరగనున్నాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ల మధ్య ముక్కోణపు పోరు జరిగింది. కానీ ఫలితాలు మాత్రం ఏకగ్రీవంలా వచ్చాయి. ఈసారి ముఖ్యంగా బీజేపీ, అధికార ఆప్‌ల మధ్య ద్విముఖ పోరు నెలకొంది. శనివారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఉదయం నాలుగు గంటల నుంచే ఢిల్లీలో మెట్రో రైలు పరుగులు పెట్టడం విశేషం.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్ఆర్‌సీలకు వ్యతిరేకంగా ఢిల్లీలో గత రెండు నెలలుగా ఆందోళన జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఏఏ ఆందోళనకు కేంద్ర బిందువుగా ఉన్న షాహీన్‌బాగ్ ప్రాంత పరిధిలోని ఐదు పోలింగ్ కేంద్రాలను సున్నితమైనవిగా గుర్తించామని ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి రణబీర్ సింగ్ వెల్లడించారు. ఆ పోలింగ్ కేంద్రాలను తాను పరిశీలించిన తర్వాతే అక్కడ కూడా పోలింగ్‌కు ఓకే చెప్పానన్నారు. గతేడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీ పరిధిలో 47 కంపెనీల బలగాలను మోహరించగా.. తాజా ఎన్నికల్లో ఆ సంఖ్య నాలుగు రెట్లకు పెంచారు.
మొత్తం 668 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. కోటి 47 లక్షల మంది ఓటర్లు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ విలువైన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 13,750 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషన్ పేర్కొంది. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి ప్రచారం అధికంగా వివాదాలకు కేంద్రమైంది. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టదిట్టం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 190 కంపెనీల సీఆర్పీఎఫ్, 19 వేల హోంగార్డులు, 42 వేల మంది స్థానిక పోలీసులను నియమించినట్లు ఢిల్లీ పోలీసు స్పెషల్ కమిషనర్ ప్రవీర్ రంజన్ వెల్లడించారు.