యమునా నది ఓవర్ ఫ్లో: ఢిల్లీని ముంచెత్తిన వరదలు
దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది ఎగువన కురుస్తున్న వర్షాలకు ఉప్పొంగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది ఎగువన కురుస్తున్న వర్షాలకు ఉప్పొంగుతోంది. యమునా నదిలో వరద నీరు 205.53 మీటర్లకు చేరుకొంది. దీంతో ఢిల్లీలోకి వరద నీరు ప్రవేశించింది. యమునా నది ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పాత యమునా బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను ఆపేశారు. యమునానది తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నదీ తీర ప్రాంతాల్లో నివసిస్తున్న 2000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు. మరికొందరు ప్రభుత్వ స్కూళ్లలో ఆశ్రయం పొందుతున్నారు.
వరద పరిస్థితిని సమీక్షించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఉన్నతాధికారులతో సమావేశమైంది. హర్యానాలోని హతింకుండ్ బ్యారేజ్ నుంచి 5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని వారు వివరించారు. ప్రజలకు విద్యుత్ సరఫరాలో అవాంతరాలు లేకుండా చూడాలని, ఆహారం, తాగునీరు అందుబాటులో ఉంచాలని, పునరావాస శిబిరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఎం కేజ్రీవాల్ అధికారులను ఆదేశించారు. మరోవైపు ఢిల్లీలో వరద ముప్పు కారణంగా పురాతన యమునా బ్రిడ్జిని మూసివేయడంతో 27 పాసింజర్ రైళ్లను భారతీయ రైల్వే తాత్కాలికంగా రద్దు చేసింది. పలు రైళ్లను దారిమళ్లించారు.