దిల్లీని కమ్మేసిన పొగమంచు
ఉదయం ఎనిమిది అయినా సూర్యుడు కనిపించడు.. సాయంత్రం ఐదు గంటలకే వెళ్ళిపోతాడు? ఇదెక్కడో చెప్పండి. ఏంటీ.. ఆలోచిస్తున్నారా? దిల్లీ అండీ బాబోయ్!!
అవునండీ దిల్లీలో సూర్యుడు గత కొద్ది రోజులుగా ఇలానే చేస్తున్నాడు. దానికి కారణం దట్టంగా అలుముకున్న పొగమంచు. దేశ రాజధాని దిల్లీ లో పొగమంచు కమ్మేసింది. చలితీవ్రత కూడా అధికంగానే ఉంది. 12-18 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత నమోదైతోంది. దట్టంగా పొగమంచు కమ్ముకొంటుండడంతో జనజీవనం స్తంభిస్తోంది. ప్రజలు చలితీవ్రతతో బయటకు రావడానికే జంకుతున్నారు. అవసరమైతే గానీ బయటకు రావడం లేదు. స్వేటర్లు, జర్కిన్లు వంటివి వేసుకొనే బయట కాలుపెడుతున్నారు. ఉదయం ఎనిమిది గంటల వరకు వాహనాలు లైట్లు వేసుకొని నడుపుతున్నారు.
దిల్లీ పొగమంచు రవాణా వ్యవస్థపై పెను ప్రభావం చూపిస్తోంది. దీని కారణంగా విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పొగమంచు కారణంగా వాహదారులు, నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు కారణంగా కాలుష్యం అధికంగా నమోదవుతోంది. శ్వాసకోశ వ్యాధులున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.