ఢిల్లీ సిగలో మరో వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్
ఢిల్లీ సిగలో మరో వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్
న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రస్తుతం ఢిల్లీ, న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దిన్ వంటి మూడు రైల్వే స్టేషన్స్ వుండగా ఈ మూడింటితోపాటుగా తాజాగా మరో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసేందుకు భారతీయ రైల్వే పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలో ప్రస్తుతం లోకల్ రైళ్లకు సేవలు అందిస్తోన్న బిజ్వాసన్ రైల్వే స్టేషన్‌ను ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దేందుకు యత్నిస్తోంది. అభివృద్ధి పనుల్లో భాగంగా ఢిల్లీ మెట్రో, ఇందిరా గాంధీ అంతర్జాతీయ రైల్వే స్టేషన్‌కి సమీపంలో వున్న బిజ్వాసన్ రైల్వే స్టేషన్‌ను ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన డిజైన్‌ను ఓ స్పానిష్ కంపెనీ, ఇండియన్ రైల్వే స్టేషన్ రీ-డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఐఆర్ఎస్ఆర్డీసీ) కలిసి సంయుక్తంగా రూపొందించాయి.
రెండు దశల్లో ఈ పనిని పూర్తిచేయనుండగా తొలి దశ కింద రూ. 350 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తొలి దశలో రెండున్నరేళ్లలో రైల్వే స్టేషన్ మెయిన్ ఏరియా, మెయిన్ టర్మినల్ ఏర్పాటు కానున్నాయి. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పోరేషన్ వద్ద రుణం తీసుకుని రైల్వే స్టేషన్ అభివృద్ధిని పూర్తి చేయనుండగా ఆ తర్వాత సదరు రైల్వే స్టేషన్ ద్వారా రానున్న రాబడితో తిరిగి ఆ రుణాన్ని చెల్లించే విధంగా ఇండియన్ రైల్వే ప్రణాళికలు రచిస్తోంది. బిజ్వాసన్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పూర్తయి వినియోగంలోకి వచ్చినట్టయితే, ఆ తర్వాత ఢిల్లీలోని మిగితా మూడు స్టేషన్లలో ప్రయాణికుల ఒత్తిడి, రద్ది తగ్గే అవకాశాలున్నాయని ఇండియన్ రైల్వే ఆశిస్తోంది.