న్యూ ఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు సోమవారం నుంచి మరింత హింసాత్మక ఘటనల వైపు మలుపు తీసుకున్న సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలోని ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో నిన్నటి నుంచి జరుగుతున్న ఈ అల్లర్లలో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 10 మంది చేరగా 150కిపైగా మంది గాయపడినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఆందోళనల్లో అల్లరిమూకలు ప్రభుత్వాల ఆస్తులు ధ్వంసం చేయడంతో పాటు పలు చోట్ల ఇళ్లు, దుకాణాలు, వాహనాలకు నిప్పుపెట్టారు. అడ్డుకోబోయిన పోలీసు బలగాలపై రాళ్లు రువ్వుతూ దాడికి పాల్పడ్డారు. ఢిల్లీలోని జాఫ్రాబాద్, చాంద్ బాగ్, మౌజ్‌పూర్, భజన్‌పుర, కర్దంపురి, గోకుల్‌పురి, ఖజురి, కరవల్ నగర్‌లకు ఈ హింస వ్యాపించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈశాన్య ఢిల్లీలో కొన్నిచోట్ల అల్లర్లు చెలరేగుతున్నప్పటికీ.. ఇంకొన్ని చోట్ల పరిస్థితి అదుపులోనే ఉందని ఢిల్లీ పోలీసు అధికార ప్రతినిధి మన్‌దీప్ రంధ్వ తెలిపారు. ఈ హింసకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 11 ఎఫ్ఐఆర్స్ నమోదైనట్టు ఆయనకు మీడియాకు వెల్లడించారు. పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని దగ్గరుండి సమీక్షిస్తున్నారని.. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF), సీఆర్పీఎఫ్ (CRPF) బలగాలు రంగంలోకి దించామని మన్‌దీప్ పేర్కొన్నారు. 


ఢిల్లీలో హింసాత్మక ఘటనలు.. ఫోటో గ్యాలరీ


ఢిల్లీకి దారితీసే అన్ని మార్గాలపై ప్రత్యేక నిఘా :
ఆందోళనకారులు హింసకు పాల్పడిన భజన్‌పుర, ఖురేజీ ఖాస్ ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రత్యేక పోలీసు కమిషనర్లు సతీష్ గోల్చ, ప్రవీర్ రంజన్ ఈ ఫ్లాగ్ మార్చ్‌కు నేతృత్వం వహించారు. హింస చెలరేగిన ప్రాంతాల్లో 1000కిపైగా సాయుధ బలగాలను మొహరించిన పోలీసులు.. ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి దారితీసే అన్ని మార్గాలపై ప్రత్యేక నిఘా వేసి పెట్టారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో చేపట్టిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ పోలీసు కమిషనర్ అమూల్య పట్నాయక్ ఈ సమావేశానికి హాజరయ్యారు. 


హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ పార్థివ దేహానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ పోలీసు కమిషనర్ నివాళి:
అల్లర్లను అదుపు చేసే క్రమంలో ఆందోళనకారుల దాడిలో గాయపడి మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ పార్థివ దేహానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, ఢిల్లీ పోలీసు కమిషనర్ అమూల్య పట్నాయక్ నివాళి అర్పించారు. దేశం కోసం రతన్ లాల్ ప్రాణత్యాగం చేసి వీర మరణం పొందారని.. ఆయన కుటుంబానికి తామంతా అండగా ఉంటామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్ పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..