కరుణానిధి ఆరోగ్యం విషమం; చెన్నై నగరంలో హైఅలర్ట్
ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధినేత, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
చెన్నై: ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధినేత, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం విషమించిందన్న ప్రచారంతో డీఎంకే కార్యకర్తలు సహనం కోల్పోతున్నారు. చెన్నైలోని వెలచ్ఛేరిలో కార్యకర్తలు ఆదివారం రాత్రి 2 ఆటోలకు నిప్పు పెట్టారు. ఇతర ప్రాంతాల్లోనూ కార్యకర్తలు భారీగా రోడ్లపైకి వస్తుండటంతో.. నగరవ్యాప్తంగా పోలీసులు అలర్ట్ ప్రకటించారు. కరుణానిధి చికిత్స పొందుతున్న కావేరీ ఆసుపత్రి వద్ద సైతం పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు.. ఆసుపత్రి ఆవరణ నుంచి డీఎంకే కార్యకర్తలు, అభిమానులను బయటకు పంపించేస్తున్నారు.
స్థానిక మీడియాలో కరుణ ఆరోగ్యంపై వస్తున్న కథనాలు కూడా కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆసుపత్రి ఆవరణ అంతా వాంగో తలైవా అన్న నినాదలతో మార్మోగిపోతున్నది. కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేశారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కరుణానిధి కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి కావేరి ఆస్పత్రికి చేరుకున్నారు. తమిళనాడు సీఎం పళనిస్వామి సేలం పర్యటనను రద్దు చేసుకొని చెన్నై బయల్దేరారు. డీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
కరుణానిధి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది: కావేరి ఆసుపత్రి వైద్యులు
కరుణానిధి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు కావేరి ఆసుపత్రి యాజమాన్యం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఈ మేరకు వారు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆదివారం రాత్రి 9 గంటలకు తాజా హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. వైద్య బృందం పూర్తి పర్యవేక్షణలో కరుణకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
వందంతులను నమ్మొద్దు: ఎ.రాజా
కరుణానిధి ఆరోగ్యంపై వదంతులు నమ్మొద్దని కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… కరుణానిధికి వైద్య బృందం చికిత్స అందిస్తోందన్నారు. కరుణానిధికి వైద్యులు పూర్తి స్థాయి చికిత్స అందిస్తున్నారన్నారు. డీఎంకే కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
కరుణానిధికి ప్రభుత్వం ఏ విధమైన వైద్య సహాయం అందిస్తోందని అనే ప్రశ్నకు తమిళనాడు సీఎం పళనిస్వామి బదులిస్తూ.. డీఎంకే నాయకుడు కరుణానిధి చికిత్సకు అవసరమైన ఏ సహాయమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సేలంలో విలేకరులతో అన్నారు. "ఆయన ఐదుసార్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవలందించారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా. కరుణానిధి చికిత్సకు అవసరమైన ఏ సహాయమైనా చేయడానికైనా మేము సిద్దమే"అని అన్నారు.
కాగా... ఆదివారం భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తమిళనాడు గవర్నర్ బన్వారిలాల్ పురోహిత్, పలువురు రాజకీయయ ప్రముఖులు కరుణానిధిని పరామర్శించారు.