చెన్నై: డీఎంకే అధినేత, కురువృద్ధుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి బుధవారం ఆస్పత్రిలో చేరారు. భుధవారం ఉదయం స్వల్ప అస్వస్థతకు గురికావడంతో ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించారు. అయితే జనరల్ చెకప్‌ కోసం ఆయన ఆసుపత్రిలో చేరినట్టు డీఎంకే వర్గాలు తెలిపాయి. శ్వాస నాళాల (ట్రాకియోటమీ) సంబంధించిన చికిత్స కోసం ఆయన చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతకొంత కాలంగా కరుణానిధి ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఆయన తీసుకుంటున్నారు. ట్రాకియోటమీ ట్యూబ్స్‌ (శ్యాస నాళాలు) మార్చాల్సి ఉందని.. చికిత్సలో భాగంగానే ఆస్పత్రిలో చేరారని డీఎంకే వర్గాలు తెలిపాయి. 2016 నుంచి ట్రాకియోటమీ చికిత్స తీసుకుంటున్న కరుణానిధి.. 2017లో కావేరి ఆస్పత్రిలో ఇందుకు సంబంధించిన చికిత్స తీసుకున్నారు.


కరుణానిధి ఆసుపత్రిలో చేరారన్న వార్త తెలియడంతో డీఎంకే కార్యకర్తలు పెద్దఎత్తున కావేరి ఆస్పత్రికి చేరుకున్నారు. పోలీసులు ఆసుపత్రి వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. కాగా ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి స్పష్టమైన వివరాలు వెల్లడికావాల్సి ఉంది.