తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి ఇక లేరు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఐదుసార్లు ఆ రాష్ట్రానికి సేవలు అందించిన 95 ఏళ్ల రాజకీయ కురువృద్ధుడు తీవ్ర అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. తొలుత రక్త పోటు తగ్గడంతో తీవ్ర అస్వస్థతకు గురైన కరుణానిధిని గత నెల 28న ఆయన కుటుంబసభ్యులు అల్వార్‌పేట్‌లోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఐసీయులో వెంటిలేటర్‌పై చికిత్స అందించి ఆయన్ను బతికించుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ... వైద్యుల కృషి ఫలించలేదు. ఆగస్టు 5వ తేదీ వరకు కరుణానిధి ఆరోగ్యం కుదుట పడుతోందనే వార్తలు వెలువడటంతో ఆయన అభిమానుల్లో ఆనందం వ్యక్తమైంది. అయితే, వారికి ఆ ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. ఆగస్టు 6వ తేదీ నుంచి కరుణానిధి ఆరోగ్యం తిరిగి విషమంగా మారిందని కావేరి వర్గాలు ప్రకటించడంతో ఆస్పత్రి వద్ద ఆందోళనకర వాతావరణం ఏర్పడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



కరుణానిధి ఆరోగ్యం విషమించిందనే వార్త విన్న అభిమానులు భారీ సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకోవడం మొదలుపెట్టారు. తమ ప్రియతమ నేత తిరిగి కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. కానీ వారి ప్రార్థనలు సైతం ఫలించలేదు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రానికి సుదీర్ఘ సేవలు అందించిన ఈ రాజకీయ కురువృద్ధుడు చివరకి తన అభిమానులకు శోకాన్నే మిగుల్చుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కరుణానిధి మృతితో యావత్ తమిళనాడు శోక సంద్రంలో మునిగిపోయింది.