పాకిస్తాన్ గూఢాచారి అరూసా ఆలమ్ ప్రస్తుతం భారతదేశంలోనే ఉన్నారని.. ఆమె పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఇంట్లో బసకు దిగారని.. ఈ విషయాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకొని దర్యాప్తు చేయించాలని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సుఖ్ పాల్ ఖైరా సంచలన వ్యాఖ్యలు చేశారు. కచ్చితమైన సమాచారంతోటే తాను ఈ విషయాలు చెబుతున్నానని ఆయన తెలిపారు.


పాకిస్తాన్‌కు చెందిన అరూసా ఆలమ్ ఓ పాత్రికేయురాలు. భారత్‌కు కూడా ఆమె పలుమార్లు వచ్చారు. అయితే ఆమె అమరీందర్ సింగ్ స్నేహితురాలని చెబుతూ.. ఆమె ఆయన ఇంట్లోనే బస చేశారని.. ఒక పాకిస్తాన్ గూఢాచారిని సాక్షాత్తు ముఖ్యమంత్రే ఇంట్లో చోటు కల్పించారని చెబుతూ.. పలు వ్యక్తిగత దూషణలు కూడా చేశారు ఖైరా. ఈ అంశంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కూడా కోరారు. అయితే ఖైరా మాటలు ఓ మతిభ్రమించిన వ్యక్తి మాట్లాడిన మాటలుగానే పరిగణించాలని పంజాబ్ పర్యాటకశాఖ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ తెలిపారు.