ముస్లిం అమ్మాయి కృష్ణుడి వేషం వేస్తే తప్పా..?
అలియా ఇటీవలే యూపీలో జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో కృష్ణుడి వేషధారణలో భగవద్గీత చదివి అందరినీ ఆకట్టుకున్నారు.
"నేను ఓ ముస్లిం బాలికను. అయితే కృష్ణుడి వేషం వేసి భగవద్గీతలో శ్లోకాలను అందరి ఎదుట చదవడం వల్ల నాకు ఫత్వా జారీ చేశారు. దయచేసి నన్ను రాజకీయాల్లోకి లాగవద్దు. ఒక వేషం వేసి, ఒక మత గ్రంథాన్ని చదివినంత మాత్రాన ఇస్లామ్ నన్ను మతం నుండి బహిష్కరిస్తుందని అనుకోవడం లేదు. ఇస్లామ్ అంత బలహీనమైన మతం కాదు" అని అలియా ఖాన్ అనే విద్యార్థిని తెలిపారు. అలియా ఇటీవలే యూపీలో జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో కృష్ణుడి వేషధారణలో భగవద్గీత చదివి అందరినీ ఆకట్టుకున్నారు.
భారతదేశంలో మతసామరస్యం కోసమే తాను ఈ పని చేశానని ఆమె తెలిపిన తర్వాత.. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు పాతికవేల రూపాయలను బహుమతిగా కూడా అందించింది. ఈ క్రమంలో ఒక ముస్లిం అయ్యి ఉండి, హిందు దేవుని వేషం వేసినందుకు, భగవద్గీత చదివినందుకు అలియాపై పలు ముస్లిం సంస్థలు ఫత్వా జారీ చేశాయి. అయితే తాను ఈ పని చేయడం ఇస్లామ్‌ను కించపరచడం కాదని..తాను ఎప్పటికీ ముస్లింనేనని.. భారతదేశంలో మతసామరస్యాన్ని పెంపొందించడానికి మరియు ఇతర మతగ్రంథాలను చదివి వాటి మీద అవగాహన పెంచుకోవడానికి ఈ పని చేశానని అలియా తెలిపారు.