ప్రధాని కొడుకు ప్రధాని కావాలన్న సంప్రదాయాన్ని మార్చింది బీజేపీ పార్టీనే: నితిన్ గడ్కరి
కేంద్ర రవాణాశాఖ మంత్రి, ప్రముఖ బీజేపీ నేత నితిన్ గడ్కరి మరోసారి కాంగ్రెస్ పార్టీ పై పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు.
కేంద్ర రవాణాశాఖ మంత్రి, ప్రముఖ బీజేపీ నేత నితిన్ గడ్కరి మరోసారి కాంగ్రెస్ పార్టీ పై పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. "పేదల జనాభా ఎక్కువగా ఉన్న ధనిక దేశం మనది. దీనికి కారణం ఎవరో తెలుసా..? దీనికి కారణం కొన్ని కుటుంబాలు. ఆ కుటుంబాల్లో ప్రధాని కొడుకు ప్రధాని కావాల్సిందే. వేరే మార్గం లేదు. అలాగే.. ముఖ్యమంత్రి కొడుకు కూడా ముఖ్యమంత్రి కావాల్సిందే. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే వారి సంప్రదాయానికి అడ్డుకట్ట వేసింది బీజేపీ పార్టీ మాత్రమే" అని గడ్కరి తెలిపారు. బీజేపీ పార్టీ ఎప్పుడూ ఒక వ్యక్తి సిద్ధాంతాల మీద నడవదని.. అది కుటుంబ పార్టీ కాదని.. కుల,మత, భాషలను బట్టి నడిచే పార్టీ కాదని ఆయన అన్నారు.
"బీజేపీలో అటల్ బిహారీ వాజ్‌పేయి లాంటి మహోన్నతమైన వ్యక్తి ఉండేవారు అని కొందరు అంటారు. కానీ ఆయనను కూడా పార్టీ అందరితో సమానంగానే చూసేది. పార్టీ ఎప్పుడూ వాజ్ పేయి పేరును బట్టి లేదా అద్వానీ గారి పేరును బట్టి నడుచుకోలేదు. అందరూ కలిసి పార్టీ సిద్ధాంతాలను గౌరవిస్తూ ముందుకు వెళ్లేవారు. ఈ రోజు నరేంద్ర మోదీ ప్రధానిగా ఉండవచ్చు. రేపు బీజేపీ గెలిస్తే.. అదే స్థానం అమిత్ షా లేదా మరెవరికో దక్కవచ్చు. నాయకత్వం అనేది మారుతూ ఉండాలి. నాయకత్వం మారినా.. పార్టీ ఎప్పుడూ ఒకే వ్యక్తి పేరు మీద నడవదు. పార్టీ అనేది పార్టీ ఆలోచనలు, సిద్ధాంతాల మీదే నడుస్తుంది" అని తెలిపారు.
హైదరాబాద్‌లోని భారతీయ జనతా యువ మోర్చా కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి గడ్కరి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ దేశం బాగుపడాలంటే వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగం ముందంజలో ఉండాలని గడ్కరి తెలిపారు. ఈ డిసెంబరు నాటికి బీజేపీ భారతదేశంలో అసలు విద్యుత్ సౌకర్యం లేని ఒక్క గ్రామాన్ని కూడా చూడాలని అనుకోవడం లేదని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం గ్రామాలను స్మార్ట్ విలేజెస్‌గా మార్చడానికి రంగాన్ని సిద్ధం చేసిందని గడ్కరి అన్నారు. ఇదే కార్యక్రమంలో కేంద్రమంత్రి రాజనాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రతిపక్షాలు బీజేపీకి లభిస్తున్న ఆదరణను చూసి భయపడుతున్నాయని.. అందుకే కూటమి పేరుతో కొత్త రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. అజెండా లేని ఆ కూటముల ప్రధాన లక్ష్యం మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే" అని సింగ్ అన్నారు.