పాల్‌ఘాట్: మహారాష్ట్రలో తెల్లవారుజామున భూకంపం వణికించింది. ఉదయం 5 గంటల 22 నిముషాలకు భూమి కంపించింది. పాల్‌ఘాట్ జిల్లాలో సంభవించిన భూకంపం  తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.8 మెగ్నిట్యూడ్‌లుగా నమోదైంది. ఈమేరకు భారత మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ (IMD) ఓ ప్రకటన విడుదల చేసింది. తెల్లవారుజామున రావడంతో భూకంపం వచ్చిన విషయం కూడా చాలా మందికి తెలియలేదు. చాలామంది ఆ సమాయానికి ఇంకా నిద్ర నుంచి మేల్కొనలేదు. మరోవైపు రిక్టార్ స్కేల్‌పై నమోదైన తీవ్రతను బట్టి అదృష్టవశాత్తుగా పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగే అవకాశం లేదని IMD అధికారులు తెలిపారు. అలాగే ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదం జరిగినట్లు కూడా వార్తలు అందలేదు. 


గత నెల 20న ఇదే జిల్లాలో భూకంపం సంభవించింది. అప్పుడు రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.5 మెగ్నిట్యూడ్‌లుగా నమోదైంది. అప్పట్లోనూ అదృష్టవశాత్తుగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. గత నెల పాల్‌ఘాట్ జిల్లాలోని ధుండల్‌వాడి గ్రామంలో భూకంపం సంభవించింది. గత ఏడాది నుంచి జిల్లాలోని దహను తాలుకానూ తరచుగా భూకంపాలు వణికిస్తున్నాయి. తరచుగా జిల్లాలో సంభవిస్తున్న భూకంపాలకు ధుండల్‌వాడి గ్రామ పరిసరాలే భూకంపకేంద్రంగా ఉంటుండటం తమను భయాందోళనలకు గురిచేస్తోందని అక్కడి స్థానికులు చెబుతున్నారు.