దేశరాజధాని ఢిల్లీలో ఆప్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. 20 మంది ఆప్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ.. ఎలక్షన్ కమీషన్ ప్రకటించింది. లాభదాయకమైన పదవులు అనుభవిస్తున్నందుకు గాను వారిపై అనర్హత వేటు వేస్తున్నట్లు కమీషన్ తెలిపింది. ఈ సమాచారాన్ని రాష్ట్రపతి కార్యాలయానికి కూడా పంపింది. ఆ సమాచార నివేదికను ఒకవేళ రాష్ట్రపతి ఆమోదిస్తే.. ఆప్‌లో ఎమ్మెల్యేల సంఖ్య 67 మంది నుండి 47 మందికి పడిపోతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిబంధనలకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ తన ఎమ్మెల్యేలకు పార్లమెంటరీ కార్యదర్శి పదవులను కట్టబెట్టడం వల్ల వారిని అనర్హులుగా ప్రకటించినట్లు ఇప్పటికే ఎలక్షన్ కమీషన్ తెలిపింది. 2015లో ప్రశాంత్ పటేల్ అనే న్యాయవాది పార్లమెంటరీ కార్యదర్శుల నియామకంలో ఆప్ ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ కోర్టులో పిటీషన్ దాఖలు చేయగా.. అదే పిటీషన్‌ను ఆధారంగా చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.


రెండు పదవులు అనుభవిస్తున్న.. 21 మంది ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని తెలిపింది. ప్రవీణ్ కుమార్, శరద్ కుమార్, మదన్ లాల్, సరితా సింగ్, నరేష్ యాదవ్, రాజేష్ గుప్తా, రాజేష్ రిషి, అనిల్ కుమార్ బాజ్‌‌పాయ్, నితిన్ త్యాగి, అల్కా లాంబా, కైలాష్ గెహ్లాట్ మొదలైన ఎమ్మెల్యేలపై ఎన్నికల సంఘం వేటు విధించడం గమనార్హం. ఆప్ పార్టీ ఎమ్మెల్యేలపై వేటు పడిందనే వార్త బహిర్గతం కాగానే.. కాంగ్రెస్, బీజేపీ ప్రతినిధులు కేజ్రీవాల్‌ను పదవి నుండి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.