ED Director SK Mishra Tenure Extended: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ ఎస్.కె. మిశ్రాకు ముచ్చటగా మూడోసారి పదవీ కాలం పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. ఈడి డైరెక్టర్‌గా ఎస్.కె. మిశ్రా పదవీ విరమణకు ఒక్క రోజు ముందుగా కేంద్రం ఈ ఆదేశాలు జారీచేయగా కేంద్ర కేబినెట్ అపాయిట్మెంట్స్ కమిటీ కేంద్రం నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఇదే తరహాలో ఎస్.కే. మిశ్రా రిటైర్మెంట్ కి ఒక్క రోజు ముందుగా పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేయడం ఇది మూడోసారి కావడం గమనార్హం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదే విషయమై ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ గతంలోనే పలువురు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికీ ఆ పిటిషన్లు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. సుప్రీం కోర్టులో ఆ పిటిషన్లపై విచారణ పెండింగ్ లో ఉండగానే తాజాగా కేంద్రం మరోసారి అదే నిర్ణయం తీసుకోవడం చర్చనియాంశమైంది. 


ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ ఎస్.కె. మిశ్రా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎస్.కె. మిశ్రా తాజా ఉత్తర్వులతో ఆ హోదాలో మరో సంవత్సరం పాటు కొనసాగబోతున్నారు. 2023, నవంబర్ 18వ తేదీ వరకు సంజయ్ కుమార్ మిశ్రా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా సేవలు అందిస్తారు. 

2018, నవంబర్ 19న సంజయ్ కుమార్ మిశ్రా తొలిసారిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. అప్పటికి ఆయన పదవీ కాలం రెండేళ్లు ఉండగా.. ఆ తర్వాత రెండు పర్యాయాలు ఆయన ఏడాది చొప్పున పదవీ కాలం పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. అయితే, ప్రతిపక్షాలు మాత్రం కేంద్రం నిర్ణయాన్ని తప్పుపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని దర్యాప్తు సంస్థలను కేంద్రం సొంత అవసరాలకు, రాజకీయ ప్రత్యర్థులపై కక్షసాధింపు చర్యల కోసమే ఉపయోగించుకుంటోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదే విషయమై సుప్రీం కోర్టులో కేంద్రానికి వ్యతిరేకంగా పిటిషన్స్ సైతం దాఖలయ్యాయి.