లాలూ ప్రసాద్ యాదవ్‌కి చుక్కెదురు.. రైల్వే టెండర్ స్కాంలో ఛార్జీషీటు ఫైల్
రాష్ట్రీయ జనతాదల్ (ఆర్జీడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పై ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ఛార్జీషీటు ఫైల్ చేసింది
రాష్ట్రీయ జనతాదల్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పై ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ఛార్జీషీటు ఫైల్ చేసింది. రైల్వే టెండర్ల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఛార్జీషీటు దాఖలు చేసిన పోలీసులు అందులో లాలూతో పాటు ఆయన భార్య రబ్రీదేవి, మాజీ బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌లతో పాటు 13 మంది పేర్లను పేర్కొన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు తన పదవిని దుర్వినియోగం చేశారని.. ఈ క్రమంలో పలువురు ఐఆర్‌సిటిసి అధికారులు కూడా ఆయనకు సహకరించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు పేర్కొన్నారు.
పూరి, రాంచీ ప్రాంతాల్లో కార్యకలపాలు నిర్వహిస్తున్న మిసెస్ సుజాతా హోటల్స్‌కు కాంట్రాక్టు కట్టబెట్టేందుకే లాలూ ఈ రైల్వే టెండర్ల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని అధికారులు అన్నారు. ఈ క్రమంలో లాలూ పలు మనీ ల్యాండరింగ్ నేరాలకు పాల్పడ్డారని.. ఈ నేరాల్లో భాగంగానే పాట్నాలోని ఖరీదైన ప్లాట్‌ని డిలైట్ మార్కెటింగ్ కంపెనీ అనే సంస్థకు కట్టబెట్టారని.. తర్వాత అదే ప్లాట్‌ని లాలూ తన భార్య రబ్రీదేవి పేరు మీద ట్రాన్స్‌ఫర్ చేయించారని అధికారులు తెలిపారు.
ఈ రైల్వే టెండర్ల స్కాంలో భాగంగా దాదాపు రూ.44 కోట్లు చేతులు మారాయని ఈడీ అధికారులు తెలిపారు. ఈ స్కాంలో భాగంగానే పీసీ గుప్తా భార్య సరళ గుప్తాకి బినామీగా ఉన్న ఓ కంపెనీకి ఐఆర్‌సిటిసి హోటల్ మెయిన్‌టెన్స్ బాధ్యతలు చూసే కాంట్రాక్టును లాలూ కట్టబెట్టారని.. అందుకోసం లాలూ భారీగా ముడుపులు కూడా తీసుకున్నారని ఈడీ అధికారులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తాము పీసీ గుప్తా కుటుంబీకులపై కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు.