జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలోని షోపియాన్‌ జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి ఉగ్రవాదుల ఏరివేత మొదలైంది. పోషియాన్‌ జిల్లా కుందలాన్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. కుండలన్‌ గ్రామంలోని ఒక ఇంట్లో ఆరుగురు ఉగ్రవాదులు చొరబడినట్లు పక్కా సమాచారం అందడంతో 34 రాష్ట్రీయ రైఫిల్స్‌, జమ్ముకశ్మీర్‌ పోలీస్‌ ఎస్‌వోజీ , సీఆర్‌పీఎఫ్‌లు సంయుక్తంగా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భద్రతాదళాల చుట్టుముట్టడంతో ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఆర్మీ అధికారులు గాయపడ్డారు. గాయపడిన వారిని శ్రీనగర్‌ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు భద్రతా దళాలు చుట్టుముట్టిన స్థావరంలో తన కుమారుడు ఉన్నాడనుకొని భ్రమించి ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించాడు.


ఎన్‌కౌంటర్‌ జరుగుతున్న కుందలాన్‌ ప్రాంతం నుంచి ప్రజలను భద్రత బలగాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కుందలాన్‌లో ఆర్మీ, ప్రత్యేక కార్యదళం, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. భద్రతా బలగాలపై స్థానిక యువకులు రాళ్ల దాడి చేశారు. దీంతో భద్రతా బలగాలు ఆందోళనకారులపై బాష్పవాయువు ప్రయోగించి చెదరగొట్టారు.


ఉగ్రవాదులు ఉన్నారనే స్పష్టమైన సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టిన భద్రతాదళాలపై ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో భద్రతాదళాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయని ఒక అధికారి చెప్పారు. కాల్పులు కొనసాగుతున్నాయని, మరిన్ని వివరాలు అందాల్సి ఉందని ఆ అధికారి అన్నారు.


అటు కుబ్బారాలోని హంద్వారా వ‌ద్ద భ‌ద్రతా ద‌ళాలు, ఉగ్రవాదుల‌కు మ‌ధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో  ఒక ఉగ్రవాది చ‌నిపోయాడు. మరికొంద‌రు ఉగ్రవాదులు స‌మీపంలోని అడ‌వుల్లో దాక్కొని ఉండ‌టంతో భ‌ద్రతా ద‌ళాలు ఆ ప్రాంతాన్ని జ‌ల్లెడ‌ప‌డుతున్నాయి. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.