రాఫెల్ డీల్ జరిగినప్పుడు ఆయన చేపలు కొనడానికి వెళ్లారు: రాహుల్ గాంధీ
ఈ రాఫెల్ డీల్ వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇదే అంశంపై మళ్లీ శనివారం మోదీ సర్కారుపై విరుచుకుపడ్డారు.
ఈ రాఫెల్ డీల్ వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇదే అంశంపై మళ్లీ శనివారం మోదీ సర్కారుపై విరుచుకుపడ్డారు. ఈ డీల్ గురించి అప్పటి రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్‌కి అసలు తెలీదని.. ఈ కాంట్రాక్టు హిందుస్తాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ చేతుల నుండి రిలయెన్స్ డిఫెన్స్ చేతుల్లోకి మారిన విషయంపై ఆయనకు అవగాహన లేదని రాహుల్ అన్నారు. బహుశా ఆ సమయంలో మనోహర్ గోవా మార్కెట్‌లో చేపలు కొనడానికి వెళ్లుంటారేమో అని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. రాహుల్ మాట్లాడుతూ "నా వద్ద ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడి స్టేట్ మెంట్ ఉంది. అందులో తమ ప్రమేయం ఏమీ లేదని.. భారత ప్రభుత్వం స్వయంగా కాంట్రాక్టును అనిల్ అంబానీకి కట్టబెట్టిందని తెలిపారు. ఈ విషయంపై మీరు ఏమంటారు" అని ప్రశ్నించారు.
తొలి సారిగా ఓ విదేశీ అధ్యక్షుడు మోదీని దొంగ అని పిలిచారని తెలుపుతూ.. హోలాండే స్టేట్ మెంట్ పై మోదీ సమాధానం చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. "ఇది ప్రధాని గారి నిజాయతీకి ప్రశ్న. అలాగే భారత జవాన్ల భవిష్యత్తుకి సంబంధించిన ప్రశ్న. ఫ్రాన్స్ అధ్యక్షుడితో జరిగిన మీటింగ్‌లో కాంట్రాక్టును అనిల్ అంబానీకి ఇవ్వాలని తీర్మానించారు. ఇప్పుడు ప్రజలు కూడా తెలుసుకుంటారు దేశానికి కాపలాగా ఉన్న వ్యక్తులు ఎంత పెద్ద దొంగలో" అని రాహుల్ తెలిపారు.
"ఫ్రాన్స్ ప్రభుత్వం చెప్పేదేమిటంటే.. భారత్‌తో తమకు జరిగిన ఒప్పందంలో బహిర్గతం చేసిన ధరల గురించి అందరికీ తెలియజేయవచ్చని.. అది సీక్రెట్ కాదని తెలిపింది. అయితే రక్షణ మంత్రి ఎందుకు ఆ వివరాలను బహిర్గతం చేయడం లేదు. ఈ డీల్ జరగడానికి 12 రోజులే ముందే అనిల్ అంబానీ కొత్త కంపెనీ ప్రారంభించారు. ఆ కంపెనీని బరిలోకి దింపి హిందుస్తాన్ ఎయిరోనాటిక్స్ సంస్థకు దక్కాల్సిన కాంట్రాక్టును తస్కరించారు. కానీ వీరేమిటి అబద్దాలు చెబుతున్నారు..? ఇప్పుడు ఈ ఒప్పందాలపై సంతకం చేసిన నరేంద్ర మోదీని రక్షించడానికి బీజేపీ నాయకులందరూ ఆలోచిస్తున్నారు" అని రాహుల్ తెలిపారు.