హైదరాబాద్: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, దేశంలో అతి పెద్ద రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ బుధవారం హైదరాబాద్‌కు రానున్నారు. ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో అఖిలేశ్‌ యాదవ్‌ సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్‌లో భాగంగా ఈ కీలక సమావేశం జరగనుంది. సమావేశంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై చర్చించే అవకాశం ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లక్నో నుండి ప్రత్యేక విమానంలో బయల్దేరి అఖిలేశ్ యాదవ్ మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుండి నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్ళి సిఎం కేసీఆర్‌ను కలుస్తారు. అక్కడే భోజనం చేసిన తరువాత ఇద్దరూ ప్రత్యేకంగా సమావేశమై ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చిస్తారు. అనంతరం అఖిలేశ్ యాదవ్ లక్నోకు తిరుగు ప్రయాణమవుతారు. సిఎం కేసీఆర్‌తో అఖిల్‌శ్ యాదవ్ భేటీకి జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుంది.


కేటీఆర్‌తో సన్నిహిత సంబంధాలు


అఖిలేశ్‌తో మంత్రి కేటీఆర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో అఖిలేశ్ సీఎంగా ఉన్నప్పుడు కేటీఆర్ లక్నోలో కలిశారు. ఆతరువాత మరికొన్ని సందర్భాల్లో ఇరువురూ కలిశారు. గతంలో అఖిలేశ్ యాదవ్ అఖిలభారత యాదవ సమ్మేళనంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చారు.


సీఎం కేసీఆర్ ఇప్పటికే 'ఫెడరల్ ఫ్రంట్'లో భాగంగా టీఎంసీ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ, జేడీఎస్ అధినేత దేవగౌడ, డీఎంకే అధినేత కరుణానిధిలను కలుసుకున్న సంగతి తెలిసిందే..! ఇదే నెలలో బిజూ జనతాదళ్ అధినేత, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కూడా కలవనున్నారని తెలిసింది.