కమల మిల్స్ అగ్ని ప్రమాదం దుర్ఘటన మిగిల్చిన విషాదం మర్చిపోకముందే ముంబైలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో నలుగురు మృతిచెందగా మరో ఏడుగురు అస్వస్థతకుగురై ఆస్పత్రిపాలయ్యారు. బుధవారం అర్ధరాత్రి దాటాకా, తెల్లవారితే గురువారం అనగా రాత్రి 1:30 గంటల ప్రాంతంలో తూర్పు అంధేరిలోని మరోల్‌లో వున్న మైమూన్ మంజిల్ భవనం 3వ అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి 2:10 గంటలకు అగ్ని ప్రమాదం గురించి తమకు సమాచారం అందడంతో వెంటనే ఫైర్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నట్టు బృహత్ ముంబై మునిసిపల్ కార్పోరేషన్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ విభాగం తెలిపింది. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 

ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని గాయపడిన వాళ్లందరినీ ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే అందులో నలుగురు మృతి చెందినట్టు ఆస్పత్రి వర్గాలు స్పష్టంచేసినట్టు సంబంధిత అధికారవర్గాలు పేర్కొన్నాయి. మృతులని సకిన కపసి, తస్లీం కపసి, మోహిన్ కపసి, దావూద్ కపసిగా అధికారులు గుర్తించారు. అగ్ని ప్రమాదం వెనుకున్న కారణాలు ఇంకా తెలియరాలేదు.

 

కమల మిల్స్ అగ్ని ప్రమాదం దుర్ఘటన జరిగి వారం రోజులైన గడవకముందే మరో అగ్ని ప్రమాదం నలుగురిని బలి తీసుకోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. బీఎంసీ అధికారులు తనిఖీలు నిర్వహించి ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని భవనాల యజమానులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ సైతం వినిపిస్తోంది.