ఇండియాలో మరో కొత్త రాజకీయ పార్టీ.. ` హమ్‌రో సిక్కిం` అంటూ వస్తున్న బైచుంగ్ భుటియా
భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ సారధి బైచుంగ్ భూటియా రాజకీయాల్లోకి వచ్చేశారు. ` హమ్‌రో సిక్కిం` పేరుతో ఆయన ఓ కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు.
భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ సారధి బైచుంగ్ భూటియా పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చేశారు. " హమ్‌రో సిక్కిం" పేరుతో ఆయన ఓ కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. సిక్కిం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసమే తాను ఆ పార్టీని స్థాపించినట్లు భుటియా తెలిపారు. సిక్కింలో యువతను ప్రభావితం చేస్తూ.. విధానాల్లో మార్పుల కోసం పోరాడేందుకే ఈ పార్టీ ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు.
ఈ రోజు ఆయన ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఈ పార్టీని అధికారికంగా ప్రారంభించారు. గతంలో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన బైచుంగ్ భుటియా ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు. 2013లో తొలిసారిగా ఆయన తృణమూల్ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారు. 2014లో లోక్‌సభ ఎన్నికల్లో భుటియా డార్జిలింగ్ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. అయితే ఎస్ ఎస్ అహ్లువాలియా చేతిలో ఓడిపోయారు
15 డిసెంబరు 1976లో సిక్కింలో జన్మించిన బైచుంగ్ భుటియా తూర్పు సిక్కింలోని సెయింట్ జేవియర్స్ పాఠశాలలో చదువుకున్నారు. ఆ తర్వాత ఫుట్‌బాల్ ఆటగాడు భాస్కర్ గంగూలీ ప్రేరణతో ఆ ఆటపై మక్కువ పెంచుకున్నాడు. తొలుత ఈస్ట్ బెంగాల్‌కు ఆడిన భుటియా ఆ తర్వాత జాతీయ జట్టు తరఫున కూడా ఆడాడు. 1998లో ఫుట్‌బాల్ క్రీడలో రాణించినందుకు అర్జున అవార్డు కైవసం చేసుకున్నాడు. 2008లో భారత ప్రభుత్వం భుటియాను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.