దేశ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రధానమంత్రి జన్ ఆరోగ్య అభియాన్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం సందర్భంగా ఈ పథకాన్ని మోదీ ప్రకటించారు. సెప్టెంబర్ 25వ తేదీ (పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి) నుంచి ఈ పథకం ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ పథకం ద్వారా పేదలందరికీ ఉచితంగా వైద్యసాయం అందిస్తామన్నారు.


తొలివిడతగా దేశంలోని 10 కోట్ల మందికి వర్తింపజేస్తామన్న ఆయన.. ఆరోగ్య భారత్ లక్ష్యంగా ఈ పథకం పనిచేస్తుందని అన్నారు. ఈ పథకం అమలు కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తామని.. అవసరమైన సిబ్బంది, సదుపాయాలు కల్పిస్తామని మోదీ చెప్పారు. గడిచిన రెండేళ్లలో 5 కోట్ల మంది దారిద్య్ర రేఖకు ఎగువకు చేరుకున్నారని మోదీ అన్నారు. స్వచ్ఛ భారత్ వల్ల దేశంలోని ఎంతో మంది చిన్నారుల ప్రాణాలు రక్షించామని, మూడు లక్షల మందికి స్వచ్ఛ భారత్ రక్షించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO ) తెలిపిందని గుర్తు చేశారు.