తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అందించే ఉచిత పథకాలపై మద్రాస్ హై కోర్టు పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉచిత బియ్యం పంపిణీ పథకంతోపాటు అటువంటి ఉచిత సరఫరా పథకాలు తమిళనాడులో జనాలను సోమరిపోతులను చేశాయని హై కోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. ఫలితంగా పనివారిని ఉత్తరాది రాష్ట్రాల నుంచి రప్పించుకోవాల్సి వస్తోందని మద్రాస్ హై కోర్టు ఆవేదన వ్యక్తంచేసింది. అలాగని నిరుపేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయడాన్ని తాము వ్యతిరేకించడం లేదన్న కోర్టు.. ప్రజల ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ ఉచిత సరఫరా చేయడం తగదని వ్యాఖ్యానించింది. జస్టిస్ కిరుబకారన్, జస్టిస్ అబ్ధుల్ ఖుడోస్‌ల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 


బియ్యం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన ఓ నిందితుడు తనపై గూండా యాక్ట్ కింద కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసిందని సమాచారం.