రైసు మిల్లు క్లర్క్ నుంచి ముఖ్యమంత్రి పదవి దాకా
రైసు మిల్లు క్లర్క్ నుండి ముఖ్యమంత్రి పదవి దాకా
కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్ యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. తగిన సంఖ్యాబలం లేనప్పటికీ మూడవసారి కర్ణాటక సీఎంగా బాధ్యతలు చేపట్టి, తాను అధికారంలోకి వస్తే ఇస్తానన్న రైతు రుణమాఫీపై తొలి సంతకం చేశారు. రైతులు రుణాలు, ఇతరత్రా హామీలను కూడా త్వరలో నేరవేరుస్తానని అన్నారు. బీజేపీతో యడ్యూరప్పకు 30 దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది. ఓక సాధారణ రైసు మిల్లు క్లర్క్ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన యడ్యూరప్పపై జీ న్యూస్ ప్రత్యేక కథనం...
యడ్యూరప్ప 1943, ఫిబ్రవరి 27న కర్ణాటకలోని మాండ్యా జిల్లా బూకనాకెరెలో సిద్ధిలింగప్ప, పుట్టథాయమ్మ దంపతులకు జన్మించారు. నాలుగేళ్ళ వయస్సులో తల్లి చనిపోయింది. ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం మాండ్యా జిల్లాలోనే జరిగింది. మాండ్యాలోని పీఈఎస్ కాలేజీలో ప్రీ-యునివర్సిటీ కాలేజ్ ఎడ్యుకేషన్(12వ తరగతి) పూర్తిచేశారు. 1965లో సాంఘిక సంక్షేమ శాఖలో ఫస్ట్ డివిజన్ క్లర్క్‌గా ఉద్యోగం సంపాదించారు. ఆతరువాత ఉద్యోగాన్ని వదిలేసి శికారిపురకు వెళ్లారు. అక్కడ వీరభద్ర శాస్త్రీ రైస్ మిల్లులో క్లర్క్‌గా ఉద్యోగంలో చేరారు. యడ్యూరప్ప 1967లో వీరభద్రశాస్త్రి కూతురైన మైత్రిదేవిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమారులు.. ముగ్గురు కుమార్తెలు.
యడ్యూరప్ప రాజకీయ ప్రస్థానం 1970లో ప్రారంభమైంది. శికారిపుర యూనిట్‌కు రాష్ట్రీయ స్వంయంసేవక్ సంఘ్ కార్యదర్శిగా, ఆతరువాత జనసంఘ్ తాలుకా శాఖకు అధ్యక్షుడిగా నియమించబడ్డారు. 1975లో శికారిపుర పురపాలక సంఘ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించడంతో అనేక నాయకులతో పాటు యడ్యూరప్ప కూడా జైలుకు వెళ్ళవలసి వచ్చింది. 1975 నుంచి 1977 వరకు బళ్ళారి మరియు శిమోగా జైళ్ళలో గడిపారు.
1980లో యడ్యూరప్ప భారతీయ జనతా పార్టీలో చేరి ఆతరువాత శిమోగా జిల్లా పార్టీ అధ్యక్షుడయ్యారు. 1988 నాటికి కర్ణాటక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడయ్యారు. 1983లో తొలిసారిగా శాసనసభకు శికారిపుర నుండి శాసన సభకు వరుసగా పోటీచేసి ఆరుసార్లు గెలుపొందారు. 1994లో బీజేపీ శాసనసభకు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. 1999లో ఎన్నికలలో ఓడిపోయిననూ పార్టీ తరఫున ఎగువసభకు నామినేట్ అయ్యారు.
ధరంసింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2004లో తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రభుత్వాన్ని పడగొట్టుటకు జనతాదళ్ (ఎస్)కు చెందిన కుమారస్వామితో జతకట్టి చెరి సగం రోజులు ప్రభుత్వం ఏర్పాటుచేయాలనే ఒప్పందం కుదుర్చుకొని తొలుత కుమారస్వామి ముఖ్యమంత్రిత్వానికి మద్దతు పలికినారు. యడ్యూరప్ప కుమారస్వామి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా మరియు ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఒప్పంద గడువు తీరిపోయిననూ కుమారస్వామి గద్దె దిగకపోవడంతో బీజేపీ పెద్దలు జోక్యంతో యడ్యూరప్పకు 2007నవంబర్‌లో ముఖ్యమంత్రి పీఠం దక్కింది (2007 నవంబర్ 12-19 వరకు). అయితే జనతాదళ్ (ఎస్) మద్దుతు నిరాకరించడంతో రాష్ట్రంలో 6 మాసాలు రాష్ట్రపతి పాలన విధించారు.
2008లో రాష్ట్రపతి పాలన అనంతరం జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంతో మే 30, 2008న రెండో పర్యాయం కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. యడ్యూరప్ప దక్షిణ భారతదేశంలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన తొలి భారతీయ జనతా పార్టీ నేతగా రికార్డు సృష్టించారు. ఈయన అసలుపేరు యడియూరప్ప కాగా 2007లో జ్యోతిష్యుడి సలహాతో యడ్యూరప్పగా పేరుమార్చుకున్నారు. ఈయన పూర్తిపేరు బూకనాకెరె సిద్దలింగప్ప యడ్యూరప్ప.
దక్షిణ భారత రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవతరించిన మొట్టమొదటి బిజెపి నాయకుడు యడ్యూరప్ప నవంబర్ 12 నుంచి 19, 2007 వరకు, మే 30, 2008 నుండి జూలై 31, 2011 వరకు రెండు సార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.
కర్నాటక లోకాయుక్త 2011లో అక్రమ మైనింగ్ కేసు దర్యాప్తు సమయంలో, యడ్యూరప్పపై నేరారోపణలు వచ్చాయి. దీంతో హైకమాండ్ ఆదేశాలతో జూలై 31, 2011న రాజీనామా ఇచ్చారు. 2012లో ఎమ్మెల్యే పదవికి, బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి 'కర్నాటక జనతా పక్ష' అనే సొంత పార్టీని స్థాపించారు.
యడ్యూరప్ప తిరిగి 2013లో బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించి, 2014లో బీజేపీలో తన పార్టీని విలీనం చేశారు. లోక్సభ ఎన్నికలకు ముందు షిమోగాగా నుండి పోటీచేసి 363,305 ఓట్లతో గెలుపొందారు. 2016లో తిరిగి కర్నాటక బీజేపీ అధ్యక్షుడిగా నియమితులై.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికయ్యారు. శికారిపుర నుంచి ఏడవ సారి ఎన్నికలలో పోటీ చేసిన యడ్యూరప్ప 35,397 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 104 సీట్లలో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. తగిన సంఖ్యాబలానికి (113) చేరుకోలేకపోయింది. కర్నాటక గవర్నర్ వాజూభాయ్ వాలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బిజేపీ పార్టీని ఆహ్వానించారు. అయితే అసెంబ్లీలో తమ మెజారిటీ నిరూపించుకోవటానికి 15 రోజుల పాటు గడువిచ్చారు. ఆ తరువాత కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేశారు.