Gandhi Jayanti 2022: అక్టోబర్ 2న మన జాతి పిత మహాత్మా మోహన్ దాస్ కరంచంద్ గాంధీ పుట్టిన రోజు. మహాత్మా గాంధీ గొప్పతనం గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఆయన భారత దేశానికి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టిన మహాత్ముడు అని చెప్పుకుంటే అది తక్కువే అవుతుంది. ఎందుకంటే దేశానికి స్వాతంత్ర్యం సాధించడం కోసం ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు.. ఎన్నో అవమానాలు భరించాడు. భారతీయులను చిత్రహింసలు పెట్టి ఆనందం పొందడం మాత్రమే తెలిసిన బ్రిటిషర్స్‌పై కూడా అహింసా మార్గంలోనే పోరాడి స్వాతంత్ర్యం సాధించిన ఘనుడాయన. స్వాతంత్ర్యం సాధించాలంటే హింస ఒక్కటే మార్గం కాదని.. అహింసతోనూ ప్రపంచాన్ని జయించవచ్చని నిరూపించిన వీరుడు మహాత్మా గాంధీ. అందుకే ఆ మహాత్ముడి ఖ్యాతి కేవలం భారత దేశానికి మాత్రమే పరిమితం కాలేదు.. ఖండాంతరాలు దాటి ప్రపంచ దేశాలు గాంధీ సిద్ధాంతాలను అనుసరిస్తున్నాయి. ప్రపంచదేశాలు గౌరవించి, స్మరించుకుంటున్న మహాత్మా గాంధీ మన జాతి పిత కావడం నిజంగా మన అదృష్టం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహాత్మ గాంధీ జయంతి 2022
1869లో గుజరాత్ లోని పోర్ బందర్ లో కరంచంద్ గాంధీ, పుత్లీబాయి గాంధీ పుణ్య దంపతులకు మహాత్మా గాంధీ జన్మించారు. తండ్రి పేరు కరంచంద్ గాంధీని కలుపుకుని ఆయనకు మోహన్ దాస్ కరంచంద్ గాంధీగా నామకరణం చేశారు. న్యాయవాది విద్యను అభ్యసించి న్యాయవాద వృత్తిని చేపట్టిన గాంధీ వృత్తిజీవితంతో సరిపెట్టుకోకుండా పుట్టిన గడ్డకు విముక్తి కల్పించేందుకు, భరత మాతను బ్రిటిషర్ల సంకెళ్ల నుంచి విడిపించేందుకు ఒక నడుం బిగించారు. 


ఫేస్‌బుక్కులు, ట్విటర్లు లేని ఆ రోజుల్లోనే దేశవ్యాప్తంగా భారీ ప్రజా ఉద్యమం
ఈనాడు ఏ రాజకీయ పార్టీ ఏం చేయాలన్నా.. మీడియాను, సోషల్ మీడియాను విరివిగా.. ఇంకా చెప్పాలనుకుంటే విచ్చలవిడిగా వాడేసుకుంటున్నాయి. కానీ ఈ ఫేస్‌బుక్కులు, ట్విటర్లు లాంటి సోషల్ మీడియా మాధ్యమాలేవీ లేని ఆ రోజుల్లోనే మహాత్మా గాంధీ ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో ఒక భారీ ప్రజా ఉద్యమాన్నే నడిపించారు. యావత్ భారతీయులకు ఒక భరోసాను కల్పించారు. ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణోద్యమం వంటి ఉద్యమాలు తీసుకొచ్చి యావత్ దేశ ప్రజలలో స్వరాజ్య స్పూర్తిని రగల్చడమే కాకుండా ఏ ఆయుధం చేతపట్టకుండానే పోరాటపటిమతో దశాబ్ధాల తరబడి జరిపిన యుద్ధంలో దిగ్విజయం సాధించారు. గాంధీ మహాత్ముడి పట్టుదలకు అతడి పోరాటపటిమే నిలువెత్తు నిదర్శనం.  


ప్రపంచ దేశాల్లోనూ మహాత్మా గాంధీకి అగ్ర తాంబూలం
మహాత్మా గాంధీ.. స్వాతంత్ర్య ఉద్యమాన్ని ముందుండి నడిపించడమే కాకుండా, స్వాతంత్ర్య సమరయోధులు అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన నాయకుడు. ఆయుధాలను పక్కనపెట్టి శాంతియుతంగా ముందుకెళ్లాలని ఆనాడే యావత్ ప్రపంచానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు. అందుకే ప్రపంచ దేశాలు ఇప్పటికీ ఆయన్ను స్మరించుకుంటున్నాయి. అహింసావాదిగా పూజిస్తున్నాయి. భారత్‌ని 200 ఏళ్లపాటు పట్టి పీడించి, ఆఖరికి మహాత్మా గాంధీ ముందు తలొంచిన ఆంగ్లేయులు సైతం ఇవాళ ఆయన్ను కీర్తించి, గౌరవించుకునే స్థాయి ఆయనది. కేవలం భారత్‌లోనే కాదు.. పలు దేశాధినేతలు భవనాల ముంగిట, ప్రపంచం గుర్తెరిగిన ప్రముఖ కూడళ్ల వద్ద గాంధీ విగ్రహాలకు చోటు దక్కడంతో పాటు గాంధీ గొప్పతనాన్ని తమ భవిష్యత్ తరాలకు చెప్పడం కోసం గాంధీ పేరిట మ్యూజియంలే వెలిశాయంటే.. ప్రపంచ చరిత్రలో ఆయనకున్న స్థానం ఎట్టిదో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఆయన సాధించిన విజయాలు అనితరసాధ్యం. 


గాంధీ జయంతి నాడే ప్రపంచ అహింసా దినోత్సవం ఎందుకు ? 
ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మహాత్మా గాంధీ సిద్ధాంతాలను గౌరవిస్తూ, ఆయన అనుసరించిన అహింసా మార్గాన్ని అనుసరిస్తూ, ఆయన్ని స్మరించుకునే లక్ష్యంతో ప్రపంచ దేశాలు కూడా గాంధీ జయంతిని ప్రపంచ అహింసా దినోత్సవంగా జరుపుకుంటున్నాయి. 2007లో యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ అక్టోబర్ 2 గాంధీ జయంతిని ప్రపంచ అహింసా దినోత్సవంగా పరిగణించాల్సిందిగా ప్రకటించింది. అప్పటి నుంచి ప్రపంచ దేశాలు గాంధీ జయంతిని క్రమం తప్పకుండా ఒక అధికారిక కార్యక్రమంగా నిర్వహించుకుంటున్నాయి. అది గాంధీ మహాత్ముడు ఈ ప్రపంచంపై వేసిన చెరగని ముద్ర. ప్రపంచంలో ఎన్నో పౌర ఉద్యమాలకు, పౌర హక్కుల పోరాటలకు స్పూర్తి ప్రధాత.. మన జాతిపిత.


Also Read : Lal Bahadur Shastri Jayanti 2022: లాల్ బహదూర్ శాస్త్రి జయంతి.. ఇండో-పాక్ వార్ హీరోకి నివాళి అర్పిస్తూ..


Also Read : Lal Bahadur Shastri Jayanti 2022: లాల్ బహదూర్ శాస్త్రి జయంతి.. శాస్త్రి గురించి చాలామందికి తెలియని నిజాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి