ఈ నెల 18న అక్షయ తృతీయ కావడంతో అప్పుడే బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఇటీవల కాలంలో బంగారం ధరల్లో క్రమక్రమంగా స్పల్ప పెరుగుదల నమోదు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదిలావుండగా రేపటి అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు పెరగడంతో బంగారానికి భారీ డిమాండ్ ఏర్పడింది. డిమాండ్‌కి తగినట్టుగానే బంగారం ధరల్లో సైతం ఒక్కసారిగా పెరుగుదల కనిపించింది. నేటి బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.350 పెరిగి రూ.32,350కి మార్కుని అందుకుంది. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయడాన్ని అదృష్టంగా భావించే వాళ్లు బంగారం కొనడానికి ఆసక్తి ప్రదర్శించనుండటంతో బుధవారం బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలావుంటే, మరోవైపు వెండి సైతం కిలోకు రూ.400 పెరిగి రూ.40,300కు చేరుకుంది.


అక్షయ తృతియ రోజున వినియోగదారుల తాకిడి పెరగనుండటంతో డిమాండ్‌ని అందుకోవడానికి వీలుగా జువెల్లర్స్, బంగారం వ్యాపారులు సైతం తగిన విధంగా నూతన డిజైన్స్ సిద్ధం చేసుకున్నారు.