న్యూఢిల్లీ: రానున్న ఏడాది కాలంలో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధరలు రూ.38,000 లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు మోతిలాల్ ఓస్వాల్ అసోసియేట్ డైరెక్టర్ కిషోర్ నార్నె చెప్పినట్టుగా ఎకనామిక్ టైమ్స్ కథనం పేర్కొంది. రానున్న ఏడాది కాలంలో ఆర్థిక మాంద్యం ముంచుకొచ్చే ముప్పుందన్న అంచనాల నేపథ్యంలో పెట్టుబడిదారులు ముందు జాగ్రత్తగా బంగారంపై భారీగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని, ఆ కారణంగానే బంగారం ధరలు భారీగా పెరగవచ్చని కిషోర్ నార్నె అభిప్రాయపడినట్టుగా సదరు వార్తా కథనం ఉటంకించింది. అంతేకాకుండా బంగారం కొనుగోలుకు ఇదే సరైన తరుణం అని కిషోర్ నార్నె చెప్పినట్టు వార్తా కథనం వెల్లడించింది. 


సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి 10 గ్రాముల బంగారం ధర రూ.32,700 పలికింది. గత మూడు వారాలుగా బంగారం ధరల సరళిని పరిశీలిస్తే, ఏ రోజు ధరలు ఆరోజే పెరుగుతూ వస్తున్నాయని, రూపాయితో పోలిస్తే డాలర్ విలువ కాస్త బలహీనపడుతుండటం, బ్రెక్సిట్ అనిశ్చితి వంటివి బంగారం ధరల పెంపునకు కారణమయ్యాయని, అమెరికాలో డాలర్ విలువ పడిపోయే కొద్దీ బంగారం ధరలకు రెక్కలొస్తాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.