ఈ రాఖీల ఖరీదు రూ.70 వేలు.. ఇంతకీ ఈ రాఖీల ప్రత్యేకతలేంటో తెలుసా ?
ఈ ఏడాది రక్షా బంధన్‌కి ఖరీదైన రాఖీలు
ఈ ఏడాది రక్షా బంధన్‌ని గుజరాత్‌లోని ఓ జువెలర్స్ షాపు యజమానులు మరింత ప్రత్యేకం చేశారు. డైమండ్ సిటీగా పేరున్న సూరత్‌లో ఓ జువెలర్ షాపు రూపొందించిన బంగారు రాఖీలు రూ.50 వేలు, రూ.70 వేల వరకు పలుకుతున్నాయి. బంగారం పూత రేకులతో తయారైన ఈ రాఖీలు అంత ధర పలకడానికి కారణం కేవలం అవి బంగారు రాఖీలు కావడం మాత్రమే కాదు... వాటిపై ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ బొమ్మలను అచ్చువేయడమే. అవును వజ్రాల వ్యాపారి మిలన్ తయారు చేయించిన ఈ రాఖీలకు ఇప్పుడు అక్కడ భారీగా డిమాండ్ ఏర్పడింది. మిలన్ మొత్తం 50 రాఖీలు తయారు చేయించగా, ఇప్పటికే 47 రాఖీలు అమ్ముడుపోయాయి. మరిన్ని రాఖీలు కావాలంటూ డిమాండ్లు కూడా వస్తున్నాయని ఆనందం వ్యక్తంచేశారు జువెలర్స్ షాపు యజమానులు.
తాను తన సోదరుడికి ఈ రాఖీ కట్టడం అంటే, తన సోదరుడు కూడా ప్రధాని నరేంద్ర మోదీ అంతటి వాళ్లు కావాలని వాళ్లను ఆశీర్వదించడమేనని ఈ రాఖీలను కొనుగోలు చేసిన ఓ సోదరి అభిప్రాయపడ్డారు.