మహిళ పొట్టలోంచి కిలోన్నర ఆభరణాలు, 90 నాణేలు
మహిళ పొట్టలోంచి కిలోన్నర ఆభరణాలు, 90 నాణేలు
కోల్‌కతా : మతిస్థిమితం లేని ఓ మహిళ పొట్టలో నుంచి కిలోన్నర నగలతో పాటు 90 నాణేలను డాక్టర్లు వెలికితీసిన వైనం పశ్చిమ బెంగాల్‌లోని భీర్‌భూమ్ జిల్లాలో చోటుచేసుకుంది. మతిస్థిమితం లేని ఆ 26 ఏళ్ల మహిళ గత రెండు నెలల నుంచి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండటంతో చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అందుకు కారణం ఆమె కడుపులో బంగారం, వెండి, రాగితో తయారు చేసిన నగలతో పాటు భారీ సంఖ్యలో రూ5, రూ10 నాణేలు కూడా ఉన్నట్లు గుర్తించడమే. గొలుసులు, చెవి, ముక్కు రింగులు, గాజులతో పాటు రూ. 5, రూ. 10ల నాణేలు ఆమె పొట్టలో ఉండటం చూసిన డాక్టర్లకు నోటమాట రాలేదు. అనంతరం ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించి వాటన్నింటిని వెలికితీశారు. శస్త్ర చికిత్స అనంతరం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్ సిద్ధార్థ్ బిశ్వాస్ తెలిపారు.
శస్త్రచికిత్స అనంతరం బాధితురాలి తల్లి మాట్లాడుతూ.. తన బిడ్డ మానసిక పరిస్థితి బాగోలేదని.. ఇంట్లో ఉన్న నగలన్నీ ఎలా మాయమవుతున్నాయని అడిగిన ప్రతీ సారి ఏడ్చేదే తప్ప ఇంకేమీ చెప్పేది కాదని అన్నారు. అంతేకాకుండా తమ కుమారుడి దుకాణంలోంచి కూడా రూ. 5, రూ. 10ల నాణేలు అదృశ్యం అయ్యేవని గుర్తుచేసుకున్నారు. ఈ సంగతి తమకు తెలియదు కానీ గత రెండు నెలల నుంచి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండటంతో ఆస్పత్రికి తీసుకొస్తే అసలు సంగతి తెలిసిందని అన్నారు.