పన్నుఎగవేతను కట్టడిచేస్తూ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) కౌన్సిల్ శనివారం ఇంటర్-స్టేట్ ఇ-వే బిల్లును తప్పనిసరి చేస్తూ ఆమోదించింది. ఫిబ్రవరి 1 నుండి ఇంటర్-స్టేట్ ఇ-వే బిల్లు అమలులోకి వస్తుంది. జూన్ 1 నుంచి ఇంట్రా-స్టేట్ ఇ-వే బిల్లును అమలులోకి తీసుకురానున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగిన 24వ సమావేశంలో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా జీఎస్టీ కౌన్సిల్ ఇ-వే బిల్లు అమలు మార్గదర్శకాలను ఆమోదించింది.


ఇ-వే బిల్లు విధానాన్ని జనవరి 15లోగా సిద్ధం చేసి పైలెట్ ప్రాజెక్టుగా ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 1 నుంచి ఇంటర్-స్టేట్, ఇంట్రా స్టేట్ ఇ-వే బిల్లును ప్రవేశపెట్టేందుకు వివిధ రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయి. 


ఇ-వే బిల్లులు సరకు రవాణా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సహాయపడతాయి. రహదారి రవాణా ధర తగ్గింపుకు దోహదపడతాయి. 


జీఎస్టీ ప్రకారం, రూ.50,000 వేలు కన్నా ఎక్కువ సరకు రవాణాకు ఇ-వే బిల్లు తీసుకోవలసి వస్తుంది. కానీ ఇందులో పారదర్శకత లోపించడంతో పన్నుఎగవేతదారులు ఎక్కువయ్యారు. వీరిని కట్టడి చేసేందుకు, మొత్తం ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకురావడానికి ఈ సమావేశం జరిగింది. 


అక్టోబర్ నెలలో, జీఎస్టీ కౌన్సిల్ 22 వ సమావేశంలో జనవరి 2018 నుంచి ఇ-వే బిల్లు వ్యవస్థ సక్రమంగా అమలు చేయాలని, 2018 ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా అమలుచేయాలని సిఫార్సు చేసింది. అయితే సెప్టెంబర్ నెలతో పోలిస్తే.. అక్టోబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు తగ్గటం దృష్ట్యా తేదీలలో మార్పులు చేసినట్లు సమాచారం.