జీఎస్టీ అనేది బూటకమని.. దీనిని గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని పిలిచే కన్నా.. గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని పిలిస్తే బాగుంటుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మోడీ సర్కారుపై విరుచుకుపడ్డారు.  జీఎస్టీ అనేది ప్రతీ చోట ఒకేలా వసూలు చేయాలని.. అది 18 శాతంగానే ఉండాలని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి చేతకాక పోతే తమకు చెప్పాలని.. 2019లో కాంగ్రెసు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ఒకే శ్లాబుతో జీఎస్టీ అమలు చేసి ప్రజలకు మేలు చేస్తామని ఆయన తెలిపారు. శనివారం ఉత్తర గుజరాత్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చిన రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. జీఎస్టీ  అంటే దేశం మొత్తం ఒకటే పన్ను అని ప్రకటించిన ప్రభుత్వం... ఐదు రకాల శ్లాబ్‌లు ఎందుకు పెట్టిందని ఆరోపించారు. అందుకే జీఎస్టీని తాను గబ్బర్‌సింగ్ ట్యాక్స్ అంటానని చెప్పారు. మన దేశానికి గబ్బర్ సింగ్ ట్యా్క్స్ అక్కర్లేదని.. ఒకే పన్ను అమలు చేయమని తాము మోడీ సర్కారుకు ఎప్పుడో చెప్పామని రాహుల్ తెలిపారు. జీఎస్టీ  వల్ల దేశంలో చిన్న, మధ్య తరగతి వ్యాపారులకు తీరని నష్టం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.