శ్రీరామనవమి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో అనేక హిందుత్వ సంస్థలు తమతో పాటు ఆయుధాలు తీసుకొని వెళుతూ.. సీతారామకళ్యాణ మహోత్సవంలో పాల్గొనడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యంతరం తెలిపారు. శ్రీరాముడు వారికేమైనా ర్యాలీల్లో పాల్గొనేటప్పుడు.. ఆయుధాలు వెంట తీసుకెళ్లమని చెప్పాడా? అని ఆమె ప్రశ్నించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"నేను కేవలం శ్రీరామనవమి పర్వదినం నాడు శాంతియుత ర్యాలీలకు మాత్రమే అనుమతి ఇచ్చాను. కానీ శ్రీరాముడి పేరు చెప్పుకొని.. గన్లు, పిస్టల్స్ చేతబూని.. ఇతరుల ఇళ్లల్లోకి వెళ్లి హింసకు పాల్పడితే మాత్రం నేను అంగీకరించను" అని మమతా బెనర్జీ వివరణ ఇచ్చారు. నిన్న శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో పలు చోట్ల అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే.


నిన్న జరిగిన వేడుకలలో ఆయుధాలను ప్రభుత్వం నిషేధించినప్పటికీ, రాష్ట్ర బిజెపి నేత దిలీప్‌ ఘోష్‌తో సహా పలువురు కత్తులు, కటార్లు వంటివాటితో కార్యక్రమంలో పాల్గొనడం చర్చనీయాంశమైంది. నిన్న శ్రీరామనవమి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌, బిజెపి పార్టీలకు చెందిన కార్యకర్తలు వేరువేరుగా ర్యాలీలో పాల్గొన్నారు.


ఈ క్రమంలో ఆయుధాలతో ఘర్షణలకు  తెగబడిన పలువురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే బెంగాల్ జిల్లా అయిన పురూలియాలోని ఆర్షాలో ఇదేవిధంగా జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మరణించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే ఈ దాడుల వెనుక తృణమూల్‌ కాంగ్రెస్‌ హస్తం ఉందని బెంగాల్ రాష్ట్ర బీజేపీ నాయకులు ఆరోపించారు.