బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్ఎల్పీ నేత కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యాక్రమం బుధవారానికి వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన దాని ప్రకారం ఈ నెల 21నే కార్యాక్రమం జరగాల్సి ఉండగా.. మంత్రివర్గ కూర్పు, ఇతర కారణాలతో ఈనెల 23వ తేదీకి వాయిదా వేసినట్లు జేడీఎస్ నేషనల్ సెక్రటరీ జనరల్ దనీష్ అలీ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రాంతీయ పార్టీల నేతలను కుమారస్వామి ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కంఠీవ స్టేడియంలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ,  పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రశేఖరరావు, చంద్రబాబు నాయుడుతోపాటు బీజేపీయేతర ముఖ్య పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం తర్వాత, బలనిరూపణకు గవర్నర్‌ ఇచ్చే 15 రోజుల సుదీర్ఘ వ్యవధి కుమారస్వామికి అక్కర్లేదని, వీలైంత త్వరగా బలనిరూపణకు సిద్ధమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.


కాగా.. శనివారం ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దాంతో తదుపరి సీఎంగా జేడీఎస్‌ శాసనసభా పక్ష నాయకుడు కుమారస్వామికి లైన్‌క్లియర్‌ అయింది. గవర్నర్‌ వాజూభాయ్‌ వాలా జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. శనివారం రాత్రి ఈ మేరకు రాజ్‌ భవన్‌ నుంచి ప్రకటన వెలువడింది. శనివారం కుమారస్వామి రాజ్ భవన్‌లో గవర్నర్‌తో సమావేశమై ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యారు.