కర్ణాటక రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం నాలుగున్నర గంటలకు కుమారస్వామి ప్రమాణం చేయనున్నారు. కుమారస్వామితో గవర్నర్ వాజూభాయ్ వాలా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. డిప్యూటీ సీఎంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జి.పరమేశ్వర ప్రమాణం చేస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బెంగళూరులో కంఠీరవ స్టేడియంలో జరిగే కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, సమాజ్ వాదీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, కేరళ సీఎం పినరయి విజయన్, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, లాలూ తనయుడు తేజస్వీ యాదవ్, ఆర్జేడీ వ్యవస్థాపకుడు అజిత్ సింగ్, నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ ఫరూక్ అబ్దుల్లా తదితరులు హాజరు కానున్నట్లు బెంగళూరు వర్గాలు వెల్లడించాయి. కొద్దిసేపటి క్రితం తాను కూడా హాజరు అవుతున్నట్లు మక్కల్ నీదిమయ్యమ్ పార్టీ అధినేత, ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్ చెప్పారు.  


ఇది ఆరంభం మాత్రమే: కేసీఆర్


తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారస్వామిని అభినందించారు. మంగళవారం బెంగళూరు వెళ్లిన కేసీఆర్.. కుమారస్వామి, దేవేగౌడలకు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. వరుస కార్యక్రమాలు ఉన్నందున బుధవారం నాటి ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేకపోతున్నారన్నారు. కర్ణాటక అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. దేశంలో ప్రాంతీయ పార్టీల విజయానికి జేడీఎస్ ప్రభుత్వ ఏర్పాటు ఆరంభం మాత్రమే అని వ్యాఖ్యానించారు.