హార్లే డేవిడ్సన్, ట్రయంఫ్, సుజుకి హయబూసా, డ్యుకాటి సూపర్ స్పోర్ట్, MV అగస్టా బ్రుటేల్, బీఎండబ్లూ S1000RR, కవసాకి Z1000 లాంటి ఖరీదైన లగ్జరీ బైక్స్ కొనుక్కోవాలని కోరిక వున్నా.. అంత ఖర్చు పెట్టే స్థోమత మనకెక్కడిది అని కొంతమంది తమ ఆశని చంపుకుని వుండొచ్చేమో!! ఎందుకంటే వాటి ఖరీదు అలాంటిది మరి! బాగా డబ్బున్న శ్రీమంతులకి తప్ప మామూలు వాళ్లకి అందుబాటులో వుండని ధరలు త్వరలోనే కొంతమేరకు దిగిరానున్నాయి. అందుకు కారణం విదేశాల నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే ఈ లగ్జరీ బైక్‌లపై భారీగా వుండే కస్టమ్స్ సుంకాన్ని కొంతమేరకు తగ్గించడమే. వాస్తవానికి ఆ బైకులు ధర అంత భారీగా పలకడానికి కారణం ఆయా బైకుల దిగుమతిపై సుమారు 75 శాతం వరకు కస్టమ్స్ సుంకం విధించడమే. కానీ తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో కస్టమ్స్ సుంకం కొంత తగ్గనుంది. 


ఇప్పటివరకు 800సీసీ కన్నా ఎక్కువ కెపాసిటీ ఇంజిన్ కలిగిన బైక్‌లపై 75 శాతం, 800సీసీ లేదా అంత తక్కువ కెపాసిటీ ఇంజిన్ కలిగిన బైక్‌లపై 60 శాతం ఇంపోర్ట్ కస్టమ్స్ సుంకం విధించిన కేంద్రం తాజాగా ఈ రెండు రకాల బైక్‌లపై సుంకాన్ని 50 శాతానికి తగ్గించింది. ఈమేరకు కేంద్ర పన్నుల శాఖ అంతిమ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగానే ఖరీదైన బైకుల ధరలు ఇకపై కొంత తగ్గే అవకాశం వుందంటున్నాయి మార్కెట్ వర్గాలు.