హిమాచల్ పోల్: బీజేపీ సీఎం అభ్యర్ధిగా ప్రేమ్ కుమార్ ధుమాల్
హిమాచల్ ప్రదేశ్ సీఎం అభ్యర్ధి విషయంలో బీజేపీ క్లారిటీ ఇచ్చింది. ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రేమ్ కుమార్ ధుమాల్ పేరును ఖరారు చేసింది. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రాలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రేమ్ కుమార్ ధుమాల్ నాయకత్వంలో తమ పార్టీ ఎన్నికల బరిలోకి దిగనుందని ప్రకటించారు.
రెండు స్లారు సీఎం పీఠమెక్కిన ధుమాల్..
ధుమాల్ (73) గతంలో రెండు సార్లు హిమాచల్ ప్రదేశ్ సీఎంగా పనిచేసిన అనుభవముంది. మార్చి 1998 నుంచి మార్చి 2003 వరకు.. మళ్లీ జనవరి 2008 నుంచి డిసెంబర్ 2012 వరకు ఆయన సీఎంగా పనిచేశారు. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని బీజేపీ ఆయన్ను సీఎం అభ్యర్ధిగా ప్రకటించింది.
జేపీ నడ్డాను కాదని.. ధుమాల్ వైపు మొగ్గు చూపిన అధిష్టానం
తొలుత కేంద్ర మంత్రిగా ఉన్న జెపి నడ్డాను సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలని భావించిన బీజేపీ అధిష్టానం..చివరి నిమిషంలో మనసు మార్చుకొని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా మాజీ సీఎం ప్రేమ్ కుమార్ ధుమాల్ పేరును ప్రకటించింది. డిసెంబర్ 18 నుంచి హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ధుమాల్ నాయకత్వంలో ఎన్నికల బరిలో దిగనుంది.