సినీ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను తలుచుకుంటే ఒక్క నిముషంలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించగలనని.. కాకపోతే తనకు అంత ఆశ లేదని.. ఎప్పుడైతే తాను సీఎం అవుతుందో  అప్పుడే తన స్వాతంత్ర్యం పోతుందని ఆమె అభిప్రాయపడ్డారు. అలాగే తాను ఎంపీ కావడానికి కారణం తన సినీ కెరీర్ మాత్రమేనని కూడా హేమమాలిని చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తనకు బాలీవుడ్ కెరీర్ బాగా ఉపయోగపడిందని.. అందరూ తనను డ్రీమ్ గర్ల్ అని పొగడడం వల్లే బాగా పాపులారిటీ పెరిగిందని అన్నారు. పార్లమెంటులోకి అడుగుపెట్టకముందు కూడా తాను బీజేపీకి చేసిన సేవలు అపారమని.. ఎంపీగా తాను ప్రజల కష్టాలను తెలుసుకొని వాటిని తీర్చినప్పుడు ఎంతో ఆనందంగా ఉండేదని కూడా హేమమాలిని అన్నారు. అలాగే పలు సమస్యలపై కూడా హేమమాలిని మాట్లాడారు. నీటి సమస్య అనేది ఈ రోజు ప్రపంచమంతా ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యని.. అందరూ కలిసి ముందుకెళ్తేనే ఈ సమస్యను పరిష్కరించవచ్చని తెలిపారు. 


అలాగే నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కూడా హేమమాలిని ప్రశంసలు కురిపించారు. రైతుల కోసం, మహిళల అభ్యున్నతి కోసం ప్రధాని తీసుకొస్తున్న పథకాలు చాలా బాగున్నాయని తెలిపారు. మోదీ వంటి ప్రధాని దొరకడం దేశం చేసుకున్న పుణ్యమని అన్నారు. ప్రతిపక్షాలు విమర్శలు చేసినప్పటికీ.. ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని కూడా పరిగణనలోకి తీసుకొని మాట్లాడితే బాగుంటుందని హేమమాలిని అభిప్రాయపడ్డారు. భన్‌స్వరా ప్రాంతంలో ఓ సంప్రదాయ కార్యక్రమానికి హాజరైన హేమమాలిని మీడియాతో సరదాగా ముచ్చటించి.. పలు విషయాలు తెలిపారు.